
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
కారేపల్లి: వ్యవసాయంలో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన లావుడ్యా భద్రు(52) నాలుగెకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశాడు. గత మూడేళ్లుగా సరైన దిగుబడి రాకపోగా, పెట్టుబడికి తెచ్చిన అప్పులు రూ.6లక్షలకు చేరాయి. ఈక్రమాన ఓ ఫెర్టిలైజర్ షాపులో గుమస్తాగా పని చేస్తుండగా, ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడంతో బుధవారం సాయంత్రం మద్యం సేవించి చేనుకు వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాడు. ఆతర్వాత భార్య అచ్చమ్మకు ఫోన్ చేయగా కుటుంబీకులు హుటాహుటీన భద్రును ఖమ్మం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరి వేసుకుని వృద్ధుడు..
నేలకొండపల్లి: మండల కేంద్రానికి చెందిన కె.వెంకన్న (58) కుటుంబ తగాదాల కారణంగా గురువారం శివార్లలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
స్నేహితులు మోసం చేశారని...
ఖమ్మంరూరల్: ఓ యువకుడి క్రెడిట్ కార్డు ద్వారా స్నేహితులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలాయపాలెం మండలం రాజారానికి చెందిన మెట్టు కరుణాకర్(29) ప్రైవేట్ ఉద్యోగం పనిచేస్తున్నాడు. ఆయన క్రెడిట్ కార్డు తీసుకున్న స్నేహితులు అప్పులు చేయగా, అవి తీర్చలేక మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. బుధవారం రాత్రి జలగంనగర్‌లోని అక్క ఇంటికి వచ్చిన ఆయన డాబాపై నిద్రించాడు. ఉదయంకల్లా రాడ్‌కు ఉరి వేసుకోగా, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.