
మిర్చి కొనుగోళ్లపై ఆరా
● ఖమ్మం మార్కెట్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ● రికార్డులు పరిశీలిస్తున్న అధికారుల బృందం
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన మిర్చి క్రయవిక్రయాలపై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, జీరో వ్యాపారం ఎక్కువగా జరుగుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో మంత్రి ఆదేశాల మేరకు మార్కెటింగ్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి సోమవారం నుంచి ఇక్కడ కొనుగోళ్లను పరిశీలిస్తున్నారు. తొలిరోజు జిల్లాలోని వివిధ మార్కెట్ల ఉద్యోగులతో కలిసి తనిఖీ చేసిన ఆమె, మంగళవారం రీజనల్ పరిధిలోని ఇతర జిల్లాల ఉద్యోగులను రప్పించారు. పెద్దపెల్లి, హన్మకొండ తదితర జిల్లాల అధికారులు తనిఖీల్లో పాల్గొంటుండగా, మిర్చి క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు.
ధరల్లో తేడా.. జీరో దందా
మార్కెట్‌లో మిర్చి ధరల్లో వ్యత్యాసం, పలువురు వ్యాపారులు, లైసెన్స్ లేని దళారులు జీరో దందా చేశారనే అంశాలపై తనిఖీలు సాగుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కాకుండా రికార్డుల్లో తక్కువగా నమోదు చేయడం, కొందరు రైతుల నుంచి పంట కొనుగోలు చేసినా వారు అమ్మలేదంటూ బయటకు పంపించి, జీరో దందా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు కూడా మార్కెట్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతుండగా.. ఒకటి, రెండు రోజుల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
పత్తిలో టీఆర్ దందాపై...
సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్ల సమయాన టీఆర్‌ల జారీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విభాగం విచారణ కొనసాగుతోంది. రైతుల నుంచి రూ.4వేలు మొదలు రూ.5వేల క్వింటా చొప్పున కొనుగోలు చేసిన దళారులు బినామీల పేరిట తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్)తీసుకుని రూ.7,521 మద్దతు ధరతో సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. ఈ అంశంపై ఉమ్మడి జిల్లాలోని మార్కెటింగ్ శాఖ అధికారులను విచారించగా.. తాజాగా వ్యవసాయ శాఖలో ఏఓలు, ఏఈఓలను వరంగల్ పిలిపించి వివరాలు సేకరించారు.