ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు

Published Wed, Apr 30 2025 12:21 AM | Last Updated on Wed, Apr 30 2025 12:21 AM

ఖమ్మం

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు

ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆర్పీఎఫ్‌ ఉద్యోగులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతీ ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేస్తూ వివరాలు ఆరా తీశారు. ప్రయాణికులతో కూడిన రైళ్లలో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఐబీ(సెంట్రల్‌ ఇంటిలెజెన్స్‌ బ్యూరో) అదికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో తనిఖీ చేయాలన్న ఆదేశాలతో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ ఉద్యోగులు రంగంలోకి దిగారు. ఈమేరకు ఖమ్మం స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సీఐ బి.సురేష్‌గౌడ్‌ అధ్వర్యాన తనిఖీలు చేపట్టగా ఏఎస్సైలు మెడీస్సానా, ప్రసన్నకుమార్‌, ఉద్యోగులు రమేష్‌, రామారావు, మదన్‌, మహేష్‌ తదితరులు పాల్గోన్నారు.

రాష్ట్రస్థాయి టోర్నీల్లో క్రీడాకారుల ప్రతిభ

ఖమ్మం స్పోర్ట్స్‌: ఇటీవల వివిధ జిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ ఉషూ రాష్ట్ర స్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఆయా కేటగిరిల్లో బాలబాలికలకు మొత్తం 21పతకాలు సాధించారు. క్రీడాకారుల్లో తొమ్మిది మంది ప్రథమస్థానంలో, ఐదుగురు ద్వితీయస్థానంలో, ఏడుగురు తృతీయస్థానంలో నిలిచారు. వీరిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్‌లు ఎం.డీ.అక్బర్‌ అలీ, పి.పరిపూర్ణాచారి మంగళవారం అభినందించారు.

డీసీసీబీ బ్రాంచ్‌

ఏర్పాటుకు స్థల పరిశీలన

కారేపల్లి: కారేపల్లిలోని విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) కార్యాలయాన్ని డీసీసీబీ సీఈఓ వెంకట ఆదిత్య మంగళవారం పరిశీలించారు. సొసైటీ పరిసరాలు, ఎరువుల గోదాంను పరిశీలించాక, డీసీసీబీ బ్రాంచ్‌ ఏర్పాటుకు భవన నిర్మాణ ప్రతిపాదనలపై ఆరా తీశారు. నిర్మాణానికి స్థలం అనువుగా ఉందా అని ఉద్యోగులతో చర్చించారు. ఆతర్వాత రైతులకు సొసైటీ ద్వారా దీర్ఘకాలిక రుణాలు అందించాలని కార్యదర్శి బొల్లు హన్మంతరావును ఆదేశించారు. అలాగే, నగదు రహిత లావాదేవీల నిర్వహణపై సూచనలు చేశారు. డీజీఎం వేణుగోపాల్‌, ఏజీఎం ప్రవీణ్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ కొంగర వేణు తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాకు

మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు మధిర చేరుకోనున్న ఆయన అక్కడ ఈద్‌ మిలాప్‌, వక్ఫ్‌ రక్షణ సభలో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుండి 3గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించాక హైదరాబాద్‌ బయలుదేరతారు.

సార్వత్రిక సమ్మెను

జయప్రదం చేయండి

ఖమ్మంమయూరిసెంటర్‌: పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా నాలుగు లేబర్‌ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని నిరసిస్తూ వచ్చేనెల 20న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఖమ్మంలో అఖిలపక్ష కార్మిక సంఘాల బాధ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శులు శింగు నర్సింహారావు, జె.వెంకటేష్‌, కె.సూర్యం, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్వంచ కృష్ణ మాట్లాడారు. కార్మికుల కోసం అమల్లో ఉన్న ప్రతీ హక్కు వెనక దశాబ్దాల పోరాటం దాగి ఉందని తెలిపారు. వీటిని కాలరేసేలా ప్రయత్నిస్తున్న కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గాదె లక్ష్మీనారాయణ, నరాల నరేష్‌నాయుడు, విష్ణువర్దన్‌, ఏ.వెంకటరెడ్డి, ఐ.వెంకన్న, తోట రామాంజనేయులు, కళ్యాణం వెంకటేశ్వరరావు, జి.రామయ్య, నీలం రాజేష్‌, పటేల్‌ పాల్గొన్నారు.

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు 
1
1/2

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు 
2
2/2

ఖమ్మం రైల్వేస్టేషన్‌లో విస్తృత తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement