వైరారూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులకు కేటాయిస్తున్నారని మండలంలోని పాలడుగు దళితులు శుక్రవారం సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఐదుగురికి పథకం మంజూరు కాగా, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారేనని తెలిపారు.
కాగా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వైరా ఎస్‌ఐ మేడా ప్రసాద్ చేరుకుని ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడించగా వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ధర్నా వద్ద ఆగిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రపాద్ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
దళితబంధు రాలేదని దీక్ష
కారేపల్లి: అన్ని అర్హతలు ఉన్నా తనకు దళిత బంధు రాలేదంటూ కారేపల్లికి చెందిన ఆదెర్ల రాధాగోవింద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష చేపట్టారు. దళితబంధు జాబితాలో పేరు చేర్చేందుకు కొందరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, తాను డబ్బు ఇవ్వకపోవడంతో గుర్తించలేదని వాపోయారు. ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు వై.ప్రకాశ్, బోళ్ల రామస్వామి, కొమ్ము ఉపేందర్, గౌసుద్దీన్, ప్రసాద్ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment