Financial Development
-
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
దళితబంధు జాబితాలో అనర్హులు
వైరారూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులకు కేటాయిస్తున్నారని మండలంలోని పాలడుగు దళితులు శుక్రవారం సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఐదుగురికి పథకం మంజూరు కాగా, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారేనని తెలిపారు. కాగా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వైరా ఎస్ఐ మేడా ప్రసాద్ చేరుకుని ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడించగా వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ధర్నా వద్ద ఆగిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రపాద్ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధు రాలేదని దీక్ష కారేపల్లి: అన్ని అర్హతలు ఉన్నా తనకు దళిత బంధు రాలేదంటూ కారేపల్లికి చెందిన ఆదెర్ల రాధాగోవింద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష చేపట్టారు. దళితబంధు జాబితాలో పేరు చేర్చేందుకు కొందరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, తాను డబ్బు ఇవ్వకపోవడంతో గుర్తించలేదని వాపోయారు. ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు వై.ప్రకాశ్, బోళ్ల రామస్వామి, కొమ్ము ఉపేందర్, గౌసుద్దీన్, ప్రసాద్ మద్దతు తెలిపారు. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై మహిళల ఆసక్తి
న్యూఢిల్లీ: అవసరాల రీత్యానే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం కోసం కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. తీవ్ర పోటీతో కూడుకున్న జాబ్ మార్కెట్లో తమకంటూ గుర్తింపు సాధించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా శ్రమతో కూడుకున్నవి, నైట్ షిఫ్టులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. 2022లో ట్రెండ్స్‌కి సంబంధించి ఉద్యోగాలు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ’అప్నా’ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులు 67 శాతం పెరిగాయి. అదే సమయంలో ఫుల్ టైమ్ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్లు 34 శాతమే పెరిగాయి. అటు నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది. శ్రమ ఎక్కువగా ఉండే డెలివరీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు, డ్రైవర్ల ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 34 శాతం పెరిగినట్లు అప్నాడాట్‌కో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. పేటీఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ కార్యాలయాల్లో సిబ్బందిపరమైన వైవిధ్యాన్ని పాటించేందుకు మహిళల కోసం అత్యధికంగా ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. హైదరాబాద్, చెన్నైలాంటి పెద్ద నగరాలతో పాటు ఇండోర్‌లాంటి చిన్న పట్టణాల్లోనూ పోస్టింగ్‌లు 28 శాతం పెరిగినట్లు అప్నా నివేదిక పేర్కొంది. -
'మహిళలు ఆర్థికాభివృద్ధిలో ముందడుగు సాధించాలి'
పగిడ్యాలః స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ముందడుగు వేయాలని రాష్ట్ర మహిళ సాధికారిక డెరైక్టర్ సంజీవ్ పన్వల్కర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు జిల్లా పగిడ్యాలలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య పొదుపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ.. పొదుపు సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారా? లేదా? అంటూ ప్రశ్నించారు. మైక్రోఫైనాన్స్ వడ్డీల భారం నుంచి విముక్తి పొందడానికి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం గ్రూపులకు వడ్డీలేని రుణాలను అందజేస్తుందని ఆయన వివరించారు. -
15,522 ఉద్యోగాల భర్తీ
ఆమోదించిన ఆర్థిక శాఖ * పోస్టుల వివరాలతో ఉత్తర్వులు * త్వరలో నోటిఫికేషన్ల విడుదల సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సైరన్ మోగింది. తొలి విడతగా 15,522 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను డెరైక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విభాగాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలన్నింటినీ జీవోలో పొందుపరిచారు. మొత్తం ఎనిమిది విభాగాల్లో గుర్తించిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), ఇతర నియామక ఏజెన్సీలు పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా జోనల్ పోస్టుల వివరాలను, రోస్టర్ పాయింట్లను, పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకున్న తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూచించింది. నియామక ఏజెన్సీలు అడిగే సమాచారాన్ని వెంటనే అందించాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జీవోలోని వివరాల ప్రకారం... టీఎస్పీఎస్సీ ద్వారా 3,783 పోస్టులు, రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 9,058, డిపార్టుమెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా 2,681 పోస్టులు భర్తీ చేస్తారు. పోస్టుల భర్తీ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లను, రాష్ట్రపతి ఉత్తర్వులను, సర్వీసు నిబంధనలను ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, సంబంధిత కార్పొరేషన్లు కచ్చితంగా పాటించాలి. పారదర్శకంగా జరిగే రాతపరీక్ష ఫలితాల ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి. ఎంపిక ప్రక్రియ, సెలెక్షన్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తారు. టీఎస్పీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సీ ద్వారా తొలి నియామకాల ప్రక్రియ మొదలవనుంది. వ్యవసాయ అనుబంధ విభాగంలో 406, సాగునీటి విభాగంలో 411 ఇంజనీర్ పోస్టులు, మున్సిపల్ పరిపాలన విభాగంలో 1,184, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో 494 పోస్టులు, రెవెన్యూ విభాగంలో 688, రవాణా, రోడ్లు భవనాల విభాగంలో 369 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23 ఎంపీడీవో, 67 ఈవో పీఆర్డీలు, 220 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐలు, 105 ఏసీటీవోలు, 23 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ టూ, 120 అగ్రికల్చర్ ఆఫీసర్లు, 311 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, హార్టికల్చర్ ఆఫీసర్లు, గ్రేడ్ టూ, గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు వీటిలో ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా తొలి విడత ఉద్యోగాల జాతరలో పోలీసు విభాగానికి సర్కారు పెద్దపీట వేసింది. అత్యధికంగా 9,058 పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది. ఎస్ఐలు, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ సర్వీసెస్ విభాగంలోని ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులు దీని పరిధిలోనే ఉన్నాయి. డెరైక్ట్ సెలెక్షన్ కమిటీ విద్యుత్తు శాఖ పరిధిలో భర్తీ చేయనున్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత విభాగాలే నిర్వహిస్తాయి. తెలంగాణ జెన్కో, తెలంగాణ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం, నార్తర్న్ డిస్కం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు పోస్టులు దీని పరిధిలోకి వస్తాయి. టీఎస్పీఎస్సీ : 3,783 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు : 9,058 డిపార్టుమెంటల్ సెలెక్షన్ కమిటీ : 2,681 మొత్తం పోస్టులు : 15,522 పదేళ్ల వయో పరిమితి పెంపు * 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి నిర్వహించే డెరైక్ట్ రిక్రూట్మెంట్ పరీక్షలకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా చేపట్టే నియామకాలన్నింటికీ ఏడాది పాటు ఈ గరిష్ట వయో పరిమితి పెంపు వర్తిస్తుంది. యూనిఫామ్ సర్వీసులుగా వ్యవహరించే పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖ తదితర విభాగాలకు ఇది వర్తించదు. వయో పరిమితిని సడలించాలని కోరుతూ నిరుద్యోగులు, ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు.. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లేని జీవో 330 వివిధ పోస్టుల కేటగిరీ, గ్రూపులు సంబంధిత పరీక్షల విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకు సంబంధించి జీవో నంబర్ 330 జారీ చేసింది. సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన ఈ జీవోలో వివరాలను రాత్రి వరకు అప్లోడ్ చేయలేదు. మంగళవారం ఈ వివరాలను వెల్లడించే అవకాశముంది.