15,522 ఉద్యోగాల భర్తీ | 15,522 Replacement jobs | Sakshi
Sakshi News home page

15,522 ఉద్యోగాల భర్తీ

Published Tue, Jul 28 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

15,522 ఉద్యోగాల భర్తీ

15,522 ఉద్యోగాల భర్తీ

ఆమోదించిన ఆర్థిక శాఖ
 
*  పోస్టుల వివరాలతో ఉత్తర్వులు
 
*  త్వరలో నోటిఫికేషన్ల విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సైరన్ మోగింది. తొలి విడతగా 15,522 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విభాగాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలన్నింటినీ జీవోలో పొందుపరిచారు. మొత్తం ఎనిమిది విభాగాల్లో గుర్తించిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), ఇతర నియామక ఏజెన్సీలు పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా జోనల్ పోస్టుల వివరాలను, రోస్టర్ పాయింట్లను, పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకున్న తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూచించింది.

నియామక ఏజెన్సీలు అడిగే సమాచారాన్ని వెంటనే అందించాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జీవోలోని వివరాల ప్రకారం... టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,783 పోస్టులు, రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 9,058, డిపార్టుమెంటల్ సెలెక్షన్ కమిటీ ద్వారా 2,681 పోస్టులు భర్తీ చేస్తారు. పోస్టుల భర్తీ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లను, రాష్ట్రపతి ఉత్తర్వులను, సర్వీసు నిబంధనలను ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, సంబంధిత కార్పొరేషన్లు కచ్చితంగా పాటించాలి. పారదర్శకంగా జరిగే రాతపరీక్ష ఫలితాల ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి. ఎంపిక ప్రక్రియ, సెలెక్షన్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తారు.
 
టీఎస్‌పీఎస్‌సీ ద్వారా
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన టీఎస్‌పీఎస్సీ ద్వారా తొలి నియామకాల ప్రక్రియ మొదలవనుంది. వ్యవసాయ అనుబంధ విభాగంలో 406, సాగునీటి విభాగంలో 411 ఇంజనీర్ పోస్టులు, మున్సిపల్ పరిపాలన విభాగంలో 1,184, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో 494 పోస్టులు, రెవెన్యూ విభాగంలో 688, రవాణా, రోడ్లు భవనాల విభాగంలో 369 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది.

23 ఎంపీడీవో, 67 ఈవో పీఆర్‌డీలు, 220 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్‌ఐలు, 105 ఏసీటీవోలు, 23 సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ టూ, 120 అగ్రికల్చర్ ఆఫీసర్లు, 311 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, హార్టికల్చర్ ఆఫీసర్లు, గ్రేడ్ టూ, గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు వీటిలో ఉన్నాయి.
 
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా
తొలి విడత ఉద్యోగాల జాతరలో పోలీసు విభాగానికి సర్కారు పెద్దపీట వేసింది. అత్యధికంగా 9,058 పోస్టులను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది. ఎస్‌ఐలు, కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ సర్వీసెస్ విభాగంలోని ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ ఆపరేటర్ పోస్టులు దీని పరిధిలోనే ఉన్నాయి.
 
డెరైక్ట్ సెలెక్షన్ కమిటీ
విద్యుత్తు శాఖ పరిధిలో భర్తీ చేయనున్న 2,681 ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత విభాగాలే నిర్వహిస్తాయి. తెలంగాణ జెన్‌కో, తెలంగాణ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం, నార్తర్న్ డిస్కం ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీరు, సబ్ ఇంజనీరు పోస్టులు దీని పరిధిలోకి వస్తాయి.
 
టీఎస్‌పీఎస్‌సీ                                 :    3,783
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు            :    9,058
డిపార్టుమెంటల్ సెలెక్షన్ కమిటీ    :     2,681
మొత్తం పోస్టులు                            :     15,522

 
పదేళ్ల వయో పరిమితి పెంపు
* 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీకి నిర్వహించే డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు అభ్యర్థుల వయో పరిమితిని పదేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా చేపట్టే నియామకాలన్నింటికీ ఏడాది పాటు ఈ గరిష్ట వయో పరిమితి పెంపు వర్తిస్తుంది. యూనిఫామ్ సర్వీసులుగా వ్యవహరించే పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ శాఖ తదితర విభాగాలకు ఇది వర్తించదు. వయో పరిమితిని సడలించాలని కోరుతూ నిరుద్యోగులు, ప్రజా ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు.. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
 
వివరాల్లేని జీవో 330
వివిధ పోస్టుల కేటగిరీ, గ్రూపులు సంబంధిత పరీక్షల విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది. అందుకు సంబంధించి జీవో నంబర్ 330 జారీ చేసింది. సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన ఈ జీవోలో వివరాలను రాత్రి వరకు అప్‌లోడ్ చేయలేదు. మంగళవారం ఈ వివరాలను వెల్లడించే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement