సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కు కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది. సర్కారీ కొలువుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది. దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది.
వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. మిగతా ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు. కొత్తగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే అప్పటివరకు ఉన్న కమిషన్ పదవీ కాలం పూర్తి కావడమో లేక రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడమో జరగాలి.
కానీ చైర్మన్, ముగ్గురు సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖలపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ఆమోదం లభించడంతో కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన చైర్మన్, ముగ్గురు సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించడంతో పాటు ఎప్పట్నుంచో ఖాళీ గా ఉన్న 4 స్థానాలు, అలాగే పదవీ విరమణ చేసిన సభ్యుడి స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసే అవకా శం ఉందని తెలుస్తోంది. తద్వారా టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే రాజీనామాలు సమర్పించని ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
పరీక్షలు, ఫలితాలు పెండింగ్‌లోనే..
వాస్తవానికి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా మార్గం సుగమం అయిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లోనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కొత్తగా ఉద్యోగ ప్రకటనల జారీ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన, ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యి ఏడాది గడుస్తోంది.
పలుమార్లు పరీక్ష తేదీలు వెల్లడించి చివరి నిమిషంలో వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను వెల్లడించలేదు. వివిధ కేటగిరీల్లో దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించినా ప్రక్రియ ముందుకు సాగలేదు. అలాగే కొత్తగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయడంలేదు. ఇవన్నీ ముందుకు సాగాలంటే చైర్మన్, ఇతర సభ్యుల నియామకం అత్యంత అవసరం. కాగా టీఎస్‌పీఎస్సీ నియామకాలకు సంబంధించి సీఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం.
ముమ్మర కసరత్తు
టీఎస్‌పీఎస్సీ సమూల ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి గత నెలలో అధికారులను ఆదేశించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి స్వయంగా యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించారు. సీఎం ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాల కోసం మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది.
సిట్ దర్యాప్తుపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా నిర్ణయం: రాజ్‌భవన్
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని వచ్చిన విమర్శలను రాజ్‌భవన్ తోసిపుచ్చింది. రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొంది. చట్టపరమైన విధానాలకు లోబడి అత్యంత శ్రద్ధతో ఒక్కరోజులోనే రాజీనామాల ఆమోద ప్రక్రియను గవర్నర్ పూర్తి చేశారని తెలిపింది. గవర్నర్ బుధవారం రాజీనామాలను ఆమోదించిన వెంటనే ఈ మేరకు వివరణ ఇచ్చింది.
నిబంధనల ప్రకారం రాజీనామాలను గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాత తన రిమార్కులు, అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాను జత చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపించారని తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంపై సిట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు.. గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిందని వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలను సమీక్షించడంతో పాటు అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయసలహా తీసుకుని తిరిగి ఫైల్‌ను ఈ నెల 9న సీఎం ద్వారా గవర్నర్‌కు పంపించిందని వెల్లడించింది. సిట్ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావానికి తావు లేకుండా చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిరుద్యోగ యువత ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా.. ఈ ప్రక్రియలో రాజ్‌భవన్ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుందని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన విధులు, న్యాయ సూత్రాలు, పారదర్శకత, జవాబుదారీతనం పరిరక్షణకు గవర్నర్ కట్టుబడి ఉన్నారని తెలిపింది.
కొత్త టీఎస్‌పీఎస్సీకి లైన్‌క్లియర్..
Published Thu, Jan 11 2024 4:31 AM | Last Updated on Thu, Jan 11 2024 8:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment