‘పోరాటాల ఫలితమే కనీస వేతనాల జీవో’
రెబ్బెన(ఆసిఫాబాద్): నర్సరీ కార్మికులు చేపట్టిన అలుపెరగని ఐక్య పోరాటాల ఫలితంగానే కనీస వేతనాల జీవో విడుదలైందని తెలంగాణ బొగ్గు గనుల కాంట్రాక్టు కార్మికు ల సంఘం బెల్లంపల్లి ఏరియా అధ్యక్షుడు అంబాల ఓదెలు అన్నారు. కనీస వేతనాల జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం గోలేటి టౌన్‌షిప్‌లో సింగరేణి నర్సరీ కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2022లో సింగరేణి వ్యాప్తంగా 18 రోజుల పాటు కాంట్రాక్టు కార్మికులు ఐక్యంగా పోరాడారని గుర్తుచేశారు. అన్నికార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడినా సీఐటీయూ పాత్ర మరువలేనిదన్నారు. ఇక నుంచి సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులందరితో సమానంగా నర్సరీ కార్మికులు సైతం కనీస వేతనాలు పొందుతారని తెలిపారు. వారి కష్టాన్ని గుర్తించి కనీస వేతనాల జీవో విడుదల చేసిన సీఎండీ బలరాంనాయక్, అటవీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు చిన్నుబాయి, రాంపల్లి శారద, అనిత, లక్ష్మి, సల్లూరి లక్ష్మి, బింగి లక్ష్మి, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment