ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. మండలంలోని కౌటగూడ, జన్కాపూర్ అంగన్‌వాడీ కేంద్రాలను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో మంజూరైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. చిన్నారులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందించే పోషకాహారం గర్భిణులు, పిల్లలకు సక్రమంగా అందించాలన్నారు. వేసవిలో ఇబ్బందులు లేకుండా నిత్యం సూపర్‌వైజర్లు సెంటర్లను సందర్శించాలని సూచించారు. కాలం చెల్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా పోషణ్ అభియాన్ సమన్వయకర్త గోపాలకృష్ణ, సూపర్‌వైజర్లు లైలా, పెంటుబాయి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌కు వివిధ పనులకు వచ్చే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్‌ను పరిశీలించారు. ఎండల నేపథ్యంలో ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు చల్లని తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏవో మధుకర్‌ను ఆదేశించారు. ఫ్రిడ్జ్‌లో లోపాలుంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.