
ఏఐ బోధనకు సిద్ధం
● జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపిక ● ఒక్కో పాఠశాలలో పది మంది విద్యార్థులకు బోధన ● కనీస సామర్థ్యాల పెంపే లక్ష్యం ● నేటి నుంచి తరగతులు ప్రారంభం
జిల్లాలో ఎంపికై న పాఠశాలలు
కెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయం తీసుకునేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ పాఠాలు బోధించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యాశాఖ 1 నుంచి ఐదో తరగతి వరకు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమం అమలు చేస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించడంతోపాటు టీచింగ్, లర్నింగ్, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, హ్యాండ్‌బుక్స్ ముద్రించి సరఫరా చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ఏఐ ద్వారా ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం మరింత మెరుగ్గా అమలు చేయనున్నారు.
నేటి నుంచి ప్రారంభం..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరిగింది. అన్నిరంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ సాంకేతికత సాయంతో ప్రాథమిక విద్య మరింత బలోపేతం కానుంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని నాలుగు ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శనివారం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతోపాటు అదనపు కలెక్టర్లు, అధికారులు ఆయా పాఠశాలల్లో ఏఐ బోధనను అధికారికంగా ప్రారంభించనున్నారు.
పది మంది విద్యార్థులు ఎంపిక..
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు ఆశించిన స్థాయిలో అభ్యనన సామర్థ్యాలు, చతుర్విద ప్రక్రియల్లో వెనుకబడుతున్నారు. ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితాలు మెరుగుపడడం లేదు. ఈ నేపథ్యంలో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో సీ గ్రేడ్‌లో ఉన్న సామార్థ్యాలను మెరుగుపర్చడం కోసం చర్యలు చేపట్టారు. జిల్లాలోని తక్కెళ్లపల్లి, గోయగాం, ఖిరిడి, సలుగుపల్లి ప్రాథమిక పాఠశాలల నుంచి పది మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులను ఏఐ పాఠాల కోసం సంసిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు సమీప ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగించనున్నారు.
బోధన ఇలా..
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పిల్లలను ఆకట్టుకునేలా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన సాగనుంది. 3, 4, 5 తరగతుల నుంచి ఎంపిక చేసిన విద్యార్థుల నుంచి ఐదుగురి చొప్పున ఒక బ్యాచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు తెలుగువాచకం, గణితం అభ్యాసాలపై 20 నిమిశాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధించనున్నారు. సదరు విద్యార్థి పాఠ్యాంశం అర్థం చేసుకుంటున్నాడా..? లేదా అని గుర్తించి.. అర్థం కాకుంటే సరైన మార్గంలో బోధన సాగిస్తుంది. ప్రతీ విద్యార్థి అభ్యసన సామార్థ్యాలు మదింపు చేయడంతోపాటు గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. వారంలో నాలుగు రోజులు ఏఐ పాఠాల బోధన సాగనుంది.
విద్యార్థులకు ఉపయోగం
ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపునకు ప్రస్తుతం ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం అమల్లో ఉంది. మరింత మెరుగైన సామర్థ్యాలు సాధించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో నాలుగు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశాం. ఆయా పాఠశాలల్లో శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభమవుతుంది. విద్యార్థులకు చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాల పెంపుకు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది.
– ఉప్పులేటి శ్రీనివాస్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్
మండలం పాఠశాల విద్యార్థులు
రెబ్బెన తక్కెళ్లపల్లి 10
కెరమెరి గోయగాం 10
వాంకిడి ఖిరిడి 10
బెజ్జూర్ సలుగుపల్లి 10

ఏఐ బోధనకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment