రూటు మార్చిన
గుండాయిపేట వద్ద వార్ధానది
కౌటాల: పేదల కడుపు నింపాల్సిన బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా.. ఇందులో అందరికీ వాటాలు ఉండడంతో రాయితీ బియ్యం పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ఆయా గ్రామాలకు తరలించడం నిత్యకృత్యంగా మారింది. దళారులతో పాటు రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందాను అరికట్టేందుకు అధికారులు, పోలీసుశాఖ చేస్తున్న ప్రయత్నాలకు రేషన్ దుకాణాల డీలర్లే గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దందాకు లోపాయికారిగా డీలర్లే సహకరిస్తుండడంతో జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా బహిరంగంగానే కొనసాగుతోందనే విమర్శ వినిపిస్తోంది. అనేక మంది లబ్ధిదారులకు దుకాణాల వద్దే రేషన్ డీలర్లు నేరుగా కిలోకు రూ.16 నుంచి రూ.18 వరకు చెల్లిస్తున్నారు. 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పోగు చేసి మహారాష్ట్రలో రూ.26 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పాలిష్ చేసి, ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రేషన్ దందాపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపడంతో అక్రమార్కులు దందా రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
రైస్ మిల్లులకు తరలింపు?
జిల్లాలో చాలా మంది ప్రజలు సన్న బియ్యం తింటుండగా ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండడంతో చాలామంది వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. రేషన్ దుకాణాల్లో విక్రయించి వాటి బదులు డబ్బులు, నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు. దీంతో నేరుగా డీలర్లే పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అర్థరాత్రి, తెల్లవారు జామున టాటా ఏసీట్రాలీ, డీసీఎం వ్యాన్‌లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు మహారాష్ట్రకు తరలించడంతో పాటు రీసైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్‌లై గోడౌన్‌లకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్‌లై శాఖలోని ఒకరిద్దరు అధికారులే ఈ దందాను ముందుండి నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. చౌకధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులకే అందేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం వేలిముద్రల నిబంధన ప్రవేశపెట్టినా.. అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. లబ్ధిదారులతో రేషన్ దుకాణాల్లో వేలిముద్రలు వేయించి నేరుగా అక్కడి నుంచే పీడీఎస్ బియ్యం బొలెరో వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. గతంలో లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఏజెంట్లు బియ్యం సేకరించేవారు. కానీ ఈ దందా విస్తరించిన క్రమంలో నేరుగా రేషన్ దుకాణాల నుంచే సేకరించే స్థాయికి చేరుకుంది.
పీడీయాక్టు నమోదు చేస్తాం
రాయితీ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. అసాంఘిక కార్యకలాపాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించాం. 2024 నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 124 కేసుల్లో 1,594 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. 214 మందిని రిమాండ్‌కు తరలించాం. తాజాగా హుడ్కిలి చెక్‌పోస్టు వద్ద 208 క్వింటాళ్ల రాయితీ బియ్యం పట్టుకుని 12 మందిని రిమాండ్‌కు తరలించాం.
– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ
రోడ్డు, రైలుమార్గంపై అధికారుల నిఘా
తరచూ పట్టుబడుతున్న వైనం
జలమార్గాన్ని ఎంచుకున్న అక్రమార్కులు..
రైస్ మిల్లులకు బియ్యం తరలింపు
జిల్లా
వివరాలు
ప్రతీనెల పంపిణీ చేస్తున్న బియ్యం 3వేల మెట్రిక్ టన్నులు
ఆహార భద్రత కార్డులు
1,39,784
అన్నపూర్ణ కార్డులు
21
అంత్యోదయ కార్డులు
13,024
నాటు పడవల్లో..
జిల్లా పోలీసు యంత్రాంగం బియ్యం దందాపై ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోడ్డు మార్గంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు సిర్పూర్(టి) మండలం హుడ్కిలి వద్ద వాహనాల్లో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. దీంతో రోడ్డు మార్గంలో పీడీఎస్ బియ్యం మహారాష్ట్రకు తరలించడం కష్టమని భావించిన అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా దందాలో రూట్ మార్చారు. జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి వార్ధా, ప్రాణహిత, పెన్‌గంగా నదుల్లో నాటు పడవల్లో ప్రమాదకరంగా మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సంచుల్లో మూటలు కట్టి రాత్రి సమయాల్లో జలమార్గం ద్వారా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కౌటాల మండలం ప్రాణహిత నదికి సరిహద్దు గ్రామాలు తుమ్మిడిహెట్టి, రణవెల్లి, బూరపెల్లి, కోర్సిని, వార్ధా నది సరిహద్దు గ్రామాలు గుండాయిపేట, వీర్ధండి, తాటిపల్లి, లోనవెల్లి, సాండ్‌గాం గ్రామాల మీదుగా నది మార్గన తరలించి సొమ్ము చేసుకుంటూ అధికారులకు సవాళ్లు విసురుతున్నారు. కొందరు అక్రమార్కులు రైలు మార్గన సైతం మహారాష్ట్రకు బియ్యం తరలిస్తూ దందా చేస్తున్నారు.
రేషన్ దొంగలు