● జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగళ్లు ● ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు ● విరిగిపడిన స్తంభాలు.. నిలిచిన విద్యుత్ సరఫరా ● ఇళ్ల రేకులు ఎగిరిపోవడంతో నష్టం ● కాగజ్‌నగర్‌లో గోడ కూలి వృద్ధుడు మృతి
కౌటాల/తిర్యాణి/కాగజ్‌నగర్‌రూరల్: జిల్లాలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లు పడటంతోపాటు భారీగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోచమ్మ గుడి వద్ద 150 ఏళ్ల భారీ మర్రి చెట్టు నేలకొరిగింది. కాగజ్‌నగర్ మండలంలోని బురదగూడ సమీపంలో రహదారిపై విద్యుత్ తీగలు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగజ్‌నగర్ రూరల్ ఎస్సై సందీప్‌కుమార్ ఘటనస్థలికి చేరుకుని సిబ్బందితో కలిసి విద్యుత్ తీగలను పైకెత్తి పట్టుకుని వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పట్టణంలోని నౌగాంబస్తీలో ఇంటి గోడ కూలి దావులత్(65) అనే వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని ఈజ్‌గాం శివాలయం ఆవరణలోని షెడ్డు కూలిపోయింది. ఈజ్‌గాం, సీతానగర్, నామానగర్, జంబుగ తదితర గ్రామాల్లో ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. కాగజ్‌నగర్– పెంచికల్‌పేట్ రహదారిలో చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
● కౌటాల మండలంలో గాలివానతో కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై కుమురంభీం చౌరస్తా వద్ద చెట్టు పడింది. సదాశివపేట కాలనీలో కౌటాల– బెజ్జూర్ ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడింది. కౌటాల పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ జేసీబీతో చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కనికి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
● చింతలమానెపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. గూడెం– కర్జెల్లి రోడ్డు బురదమయంగా మారింది. విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.
● దహెగాం మండలంలో వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిర్చి తోటల్లో పంట నేలరాలింది. మామిడి తోటల్లో కాయలు రాలిపడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
● తిర్యాణి మండలంలోని అటవీప్రాంతంలో భారీ వర్షానికి గుండాల జలపాతం ఉప్పొంగింది. జలకళను సంతరించుకుంది. గాలులకు చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
రెబ్బెనలో భారీ నష్టం
రెబ్బెన: మండలంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. రెబ్బెన, గోలేటి, వరదలగూడ, గొల్లగూడ, నంబాల తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ ఆవరణలో ఉన్న షెడ్డు, గొల్లగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్లు నామరూపాలు లేకుండా దెబ్బతిన్నాయి. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గోలేటి టౌన్‌షిప్‌లో సింగరేణి సబ్ స్టేషన్ సమీపంలో భారీ నీలగిరి వృక్షం విరిగి విద్యుత్ తీగలపై పడింది. కార్మిక కాలనీల్లోనూ చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. వరదలగూడ గ్రామానికి చెందిన కోడిపుంజుల సంతోష్ ఇంటిపై చెట్టు కొమ్మలు విరిగిపడి ఇల్లు ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే గ్రామానికి చెందిన దేనవేణి తిరుపతి, మంత్రి తిరుపతి, పోగుల రమేశ్, అప్పాల రవి, గోగారం రాజేశ్‌తోపాటు పలువురి ఇళ్ల ఎదుట వేసిన రేకుల షెడ్ల పైకప్పు రేకులు ఎగిరి దూరంగా పడ్డాయి. మండల కేంద్రానికి చెందిన సత్రపు సత్తయ్య ఇంటి ఎదుట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనంపై చెట్టు విరిగి పడ్డాయి. బైక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణాల ఎదుట రేకులు లేచిపోయాయి.
గాలివాన బీభత్సం
గాలివాన బీభత్సం
గాలివాన బీభత్సం
గాలివాన బీభత్సం
గాలివాన బీభత్సం
గాలివాన బీభత్సం