రెబ్బెన(ఆసిఫాబాద్): నేటి కాలంలో ఇంటి నుంచి ఆకాశం వరకు అన్నిరంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారని, వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సినీ నటుడు బాబుమోహన్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్‌కుమార్ దంపతులు మండలంలోని పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు ఆదివారం దేవులగూడలో చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. ఇంటితోపాటు సమాజంలో అనేక బాధ్యతలు నెరవేరుస్తూనే మగవారితో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. భూదేవికి ఉన్నంత ఓర్పు కలిగిన మహిళలు ఆగ్రహిస్తే ఆదిపరాశక్తులుగా మారుతారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, జిల్లా ఉపాధ్యక్షుడు గుల్బం చక్రపాణి, మండల అధ్యక్షుడు మల్రాజు రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మండల మాజీ అధ్యక్షుడు గోలెం తిరుపతి, నాయకులు నవీన్‌గౌడ్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.