ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కౌటాలలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
మూడు రోజుల పాటు నిర్వహణ
కౌటాల: క్రీడలతో ఉజ్వల ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కౌటాల పోలీస్ స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతూ ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.
యువతకు నిత్యజీవితంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే బంగారు భవిష్యత్ నాశనమవుతుందన్నారు. ఈ క్రీడాపోటీలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న పోటీల్లో విజేత జట్లకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10వేల నగదుతో పాటు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌటాల సీఐ ముత్యం రమేశ్, కాగజ్‌నగర్ సీఐ రాజేంద్రప్రసాద్, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు మధుకర్, నరేష్, ప్రవీణ్, కొమురయ్య, రాజు, సందీప్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో అవకాశాలు..
క్రీడల్లో పాల్గొని రాణించే వారికి ఆయా రంగాల్లో అవకాశాలుంటాయి. శారీరక, మానసిక పరమైన ఉపయోగాలు ఉంటాయి. ఆరోగ్య రక్షణలో క్రీడల పాత్ర ఎంతగానో ఉంటుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. గ్రామీణ యువతను ప్రోత్సహించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసి మూడు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాం. మంచి స్పందన వచ్చింది.
– ముత్యం రమేశ్, సీఐ, కౌటాల