ఆసిఫాబాద్‌అర్బన్: ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు డీఏలు, 2023 జూన్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్‌సీలు ఇవ్వలేని ముఖ్యమంత్రి అనడం సరికాదని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువారం మాట్లాడారు. డీఎ, పీఆర్‌సీ అడిగితే నెలనెలా వేతనాలు ఇవ్వలేమని అనడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊశన్న మాట్లాడుతూ ప్రభుత్వం సగం మంది ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే 1వ తేదీన వేతనాలు చెల్లిస్తుందని అన్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములని, బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇందూరావ్, కోశాధికారి రమేశ్, జిల్లా కార్యదర్శి హేమంత్ షిండే, సభ్యులు రాజు, కమలాకర్‌రెడ్డి, సుభాష్, జాదవ్, మహిపాల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.