● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ● కలెక్టరేట్‌లో అధికారులతో పలు అంశాలపై సమీక్ష
మాట్లాడుతున్న చైర్మన్ బక్కి వెంకటయ్య, పక్కన సభ్యులు, అధికారులు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గా ల ప్రజల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, ప్రవీణ్, నీలాదేవి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుశాంత్‌తో కలిసి ఆర్‌వోఆర్ పట్టాలు, అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించే ప్రయోజనాలపై జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసులు, బాధితులకు అందిన పరిహారం, ఎస్సీ, ఎస్టీలకు జరిగిన భూపంపిణీ, వివాదాలు, పోడు భూముల పరిష్కారం, గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాలు, ఉద్యోగులకు కల్పిస్తున్న పదోన్నతులు, రోస్టర్ విధానంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీ కేసులు, ఎస్సీ, ఎస్టీల సమస్యలు ఈ నెల 31లోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు నిబంధనల ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి రోజు గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించి చట్టాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాలను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారులను నియమిస్తామని తెలిపారు. అంతకు ముందుకు కలెక్టరేట్‌కు వచ్చిన కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సజీవన్, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రేగుంట కేశవ్‌రావు, గోపాల్, గణేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
హాజరైన అధికారులు
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి