
పోటీలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం
● జీఎం విజయ భాస్కర్‌రెడ్డి
రెబ్బెన(ఆసిఫాబాద్): క్రీడాపోటీలతో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని శ్రీ భీమన్న స్టేడియంలో 36వ వేణుగోపా ల్ మెమోరియల్ ఇన్విటేషన్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజ రైన జీఎం స్టేడియంలో క్రీడాపతాకం ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా వేణుగోపాల్ మెమోరియల్ క్రీడాపోటీలను సంస్థ నిర్వహిస్తోందన్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ ఏటా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో వార్షిక క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. మారుమూల ప్రాంతమైన బెల్లంపల్లి ఏరియాలో నిర్వహిస్తున్న ఈ క్రీడాపోటీలకు రాష్ట్రంలోని నలుమూల నుంచి క్రీడాకారులు హాజరు కావడం సంతోషకరమన్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ పోటీల్లో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం ఐఈడీ ఉజ్వల్ కుమార్ బెహారా, సీఎంవోఏఐ కార్యదర్శి వీరన్న, డీజీఎం సివిల్ మదీనా బాషా, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.