అంగన్‌వాడీల్లో ట్రాకర్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ట్రాకర్‌

Published Sat, Apr 12 2025 2:58 AM | Last Updated on Sat, Apr 12 2025 2:58 AM

అంగన్

అంగన్‌వాడీల్లో ట్రాకర్‌

● అందుబాటులోకి రానున్న పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ ● ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల వివరాలు నమోదు ● ముఖ గుర్తింపు ద్వారా సరుకులు పంపిణీకి కసరత్తు

దహెగాం(సిర్పూర్‌): అంగన్‌వాడీ కేంద్రాల్లో మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోషణ్‌ ట్రాకర్‌ మొబైల్‌ అప్లికేషన్‌ అందుబాటులోకి తీ సుకురానుంది. ఫేస్‌ క్యాప్చర్‌(ముఖ గుర్తింపు) సౌకర్యంతో లబ్ధిదారులతోపాటు కేంద్రాల్లో అందించే సేవలపై పర్యవేక్షించనున్నారు. దీని ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావి స్తోంది. ప్రస్తుతం జిల్లాలో చిన్నారుల వివరాలను ఫొటోపాటు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ ప్రక్రియ 80శాతం ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మే తర్వాత నుంచి యాప్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

973 అంగన్‌వాడీ కేంద్రాలు..

జిల్లావ్యాప్తంగా 834 మెయిన్‌, 139 మినీ కేంద్రాలతో కలిసి మొత్తం 973 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో చిన్నారులు 40,812 మంది ఉండగా, గర్భిణులు 4,688 మంది, బాలింతలు 3,502, కిశోర బాలికలు 16,564 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారుల వివరాల నమోదు 80 శాతం పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిన 20 శాతం మంది స్థానికంగా లేకపోవడంతో ఆలస్యమవుతుందని వారు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఫొటోపాటు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. యాప్‌లోని ఫేస్‌ అథెంటిక్‌ ఫీచర్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల కార్యకలాపాలు, సేవలతోపాటు పోషకాహారం పంపిణీని చివరి వరకు ట్రాక్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. గర్భిణులు, బాలింతల వివరాలు సైతం ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉన్నా.. ఇంకా ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాలేదు.

సిగ్నల్‌ లేనిచోట ఇబ్బందులు

సెల్‌ఫోన్‌లో పోషణ్‌ ట్రాక్‌ యాప్‌ను టీచర్లు ఇన్‌స్టాల్‌ చేసుకుని వివరాలు నమోదు చేస్తున్నారు. అయితే జిల్లాలో తిర్యాణి మండలంతోపాటు సిగ్న ల్‌ లేని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్యతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్‌ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు. ఆయా గ్రామాల్లో ముందుగానే ఫొటో తీసుకుని.. సిగ్నల్‌ ఉన్నచోటుకు వెళ్లిన తర్వాత యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నామని తెలిపారు. మే నెల నుంచి యాప్‌ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ చేపడితే సిగ్నల్‌ లేనిచోట మరింత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

80 శాతం పూర్తి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫేస్‌ రికగ్నైషేన్‌ క్యాప్చర్‌ అప్‌లోడ్‌ ఇప్పటి వరకు జిల్లాలో 80 శాతం పూర్తయింది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నెట్‌వర్క్‌ ఇబ్బంది ఉన్న చోట మ్యానువల్‌గా ఫొటో తీసుకుని సిగ్నల్‌ ఉన్నచోట యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో డూప్లికేట్‌ను అరికట్టి, సరుకులు పక్కదారి పట్టకుండా చూడటం యాప్‌ ప్రధాన ఉద్దేశం.

– భాస్కర్‌, ఐసీడీఎస్‌ పీడీ

ముఖం గుర్తిస్తేనే సరుకులు

పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో ముందుగా లబ్ధిదారుల ముఖాన్ని స్కాన్‌ చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత సంబంధిత లబ్ధిదారు నంబర్‌కు ఓటీపీ సైతం వెళ్తుంది. ఆ తర్వాతే సరుకులు అందించనున్నారు. ఒక వేళా యాప్‌ ఫొటో గుర్తించకుంటే సరుకులు అందించరు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు కాని వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుండదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పోషణ్‌ ట్రాకర్‌ అప్లికేషన్‌లో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఏడు నెలలు మూడేళ్ల లోపు చిన్నారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక వేళ చిన్నారులకు ఆధార్‌కార్డు లేకుంటే వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్‌ అనుసంధానిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఫొటోలు పొరపాటున తప్పుగా అప్‌లోడ్‌ చేసినా మరోసారి సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు.

అంగన్‌వాడీల్లో ట్రాకర్‌1
1/1

అంగన్‌వాడీల్లో ట్రాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement