మచిలీపట్నంటౌన్: బందరుకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. నగరంలోని 21వ డివిజన్ బందరుకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండు వీరార్జున వినయ్ (కన్నా) తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలు శనివారం స్వస్థలానికి చేరుకున్నాయి. కన్నా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల నుంచి భార్య, ఇద్దరి కుమార్తెలతో బెంగళూరులో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం కన్నా భార్య హైమావతి తల్లిదండ్రులు.. ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయలేదు.
అనుమానం వచ్చిన వారు బెంగళూరులో కుమార్తె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని కడిగోడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తలతో పాటు పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పిల్లలను హతమార్చి తరువాత భార్యభర్తలు ఉరివేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఘటనకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. వీరికి రెండేళ్ల వయసున్న హనీ, ఎనిమిది నెలల వయసున్న కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని కడిగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కడిగోడి పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment