యువకుల ప్రేమ.. సహజీవనం.. ప్రేమ కోసం అమ్మాయిగా మారితే.. షాకిచ్చిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

యువకుల ప్రేమ.. సహజీవనం.. ప్రేమ కోసం అమ్మాయిగా మారితే.. షాకిచ్చిన యువకుడు

Published Thu, Aug 17 2023 1:14 AM | Last Updated on Thu, Aug 17 2023 11:13 AM

- - Sakshi

కృష్ణలంక(విజయవాడతూర్పు): ఇద్దరు యువకులు ప్రేమలో పడ్డారు. ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. ఇరుగు పొరుగువారి నుంచి ఛీత్కారం ఎదురైంది. తమలో ఒకరు అమ్మాయిగా మారితే ఇరుగుపొరుగువారి నుంచి ఇబ్బందులు ఉండవని ఓ యువకుడు భావించాడు. జీవితాంతం స్నేహితుడితోనే కలిసి ఉండొచ్చని ఆశపడ్డ అతను లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయితే ఆపరేషన్‌ చేయించుకుని ఆమెగా మారిన అతడిని స్నేహితుడు మోసగించాడు. పెళ్లి చేసుకోనంటూ ఇంటి నుంచి గెంటేశాడు. మోసపోయిన ఆమె ఫిర్యాదు చేయడంతో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు..

పెనమలూరుకు చెందిన ఎ.పవన్‌, కృష్ణలంకకు చెందిన ఇ.నాగేశ్వరరావు 2017–19 మధ్య కాలంలో బీఈడీ చేసే రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్ని నెలల తరువాత ఆ ఇష్టం ప్రేమగా మారడంతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. బీఈడీ పూర్తయ్యాక 2019 నుంచి కృష్ణలంకలోని సత్యంగారి హోటల్‌ సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం ప్రారంభించి, బతుకుదెరువు కోసం అక్కడే ట్యూషన్‌ సెంటర్‌ నిర్వహించారు.

ఇద్దరి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి మాటలు తట్టుకోలేక, విడిపోయి ఉండలేక మానసిక వేదన అనుభవించారు. తమలో ఒకరు అమ్మాయిగా మారితే కలిసి జీవించేందుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవనే నిర్ణయానికి వచ్చారు. పవన్‌ ఢిల్లీ వెళ్లి రూ.లక్షలు వెచ్చించి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించు కుని యువతిగా మారి భ్రమరాంబికగా సమాజంలోకి అడుగుపెట్టాడు. అయితే భ్రమరాంబిక సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ప్రేమి కుడు ఆమెను మోసగించి పరారయ్యాడు.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన కథ
నాగేశ్వరరావు కోసం తన జీవితాన్నే త్యాగం చేశానని, అతను తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ భ్రమరాంబిక ఈ నెల పదో తేదీన కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మి నాగేశ్వరరావుకు పలు విడతలుగా రూ.26 లక్షల నగదు, 11 నవర్సల బంగారం ఇచ్చానని, 2022 డిసెంబర్‌లో తనను పెళ్లి చేసుకోనని నాగేశ్వరరావు తేల్చిచెప్పి, ఇంటి నుంచి గెంటేసి, మంగళగిరికి మకాం మార్చాడని ఫిర్యాదులో పేర్కొంది.

తనను మోసగించి, తన నగదులో పరారైన నాగేశ్వరరావు, అందుకు కారణమైన అతని తల్లి విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరింది. నాగేశ్వరరావు, అతని తల్లి విజయలక్ష్మిపై చీటింగ్‌, నమ్మకద్రోహం, ట్రాన్స్‌ జెండర్‌ హక్కుల రక్షణ చట్టం సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement