దసరాకు సన్నాహాలు | - | Sakshi
Sakshi News home page

దసరాకు సన్నాహాలు

Published Wed, Sep 20 2023 1:42 AM | Last Updated on Wed, Sep 20 2023 8:00 AM

మాట్లాడుతున్న ఆలయ కమిటీ చైర్మన్‌ రాంబాబు, ఈవో భ్రమరాంబ తదితరులు  - Sakshi

మాట్లాడుతున్న ఆలయ కమిటీ చైర్మన్‌ రాంబాబు, ఈవో భ్రమరాంబ తదితరులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగు తున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను వారు మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.

మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు
ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్‌ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

22న వేదసభ
ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్‌, దుర్గాఘాట్‌, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్‌ 20న పట్టువస్త్రాల సమర్పణ
ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 20వ తేదీ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించ నున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement