Temple committee
-
దసరాకు సన్నాహాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సన్నాహాలు జరుగు తున్నాయని సుమారు రూ.7 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే దసరా ఉత్సవాల ఏర్పాట్లను వారు మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు 10 విశేష అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రూ.2.50 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో గతేడాది ఆరు లక్షలకు పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటే ఈ ఏడాది అంతకు మించి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. గత ఏడాది ఉత్సవాల్లో 16 లక్షలకు పైగా లడ్డూలను దేవస్థానం అందించిందని, ఈ ఏడాది సుమారు 20 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. మూలా నక్షత్రం రోజున రూ.500 వీఐపీ టికెట్లు ఉత్సవాల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున రూ. 500 వీఐపీ టికెట్లను విక్రయించాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తారని తెలిపారు. రూ.500 వీఐపీ టికెట్ తీసుకున్నా ముఖ మండపం దర్శనం మాత్రమే కల్పిస్తామని వివరించారు. మిగిలిన రోజుల్లో రూ. 100, రూ.300, రూ. 500 టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు సుమారు రెండు వందల మంది పని చేస్తున్నారని, భక్తుల తలనీలాలు తీసేందుకు ఇతర ఆలయాలు, బయట నుంచి ఆరు వందల మంది అందుబాటులో ఉంటారని తెలిపారు. 22న వేదసభ ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిర్వహించే ఆది దంపతుల నగరోత్సవం మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వద్ద యాగశాల నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహా మండపం, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, దేవస్థాన ఘాట్‌రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందన్నారు. రాజగోపురం ఎదుట పూజతో నగరోత్సవం ముగుస్తుందన్నారు. 21న అర్చక సభ, 22న వేద సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాల్లో చివరి రోజు 23వ తేదీ నుంచి భవానీల రాక ప్రారంభమవుతుందని భావిస్తున్నామని, మూడు రోజుల పాటు తాకిడి ఉండే అవకాశాలున్నాయన్నారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, బచ్చు మాధవీకృష్ణ, చింకా శ్రీనివాసులు, తొత్తడి వేదకుమారి, వైదిక కమిటీ సభ్యులు యజ్జనారాయణశర్మ, మురళీధర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 20న పట్టువస్త్రాల సమర్పణ ఉత్సవాల్లో తొలిసారిగా అమ్మవారిని మహా చండీదేవిగా అలంకరిస్తామని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య పేర్కొన్నారు. తొలిరోజున అమ్మవారి శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారన్నారు. 20వ తేదీ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించ నున్నారన్నారు. 23వ తేదీ రెండు అలంకారాల్లో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చునన్నారు. ఉదయం మహిషాసురమర్దని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 23వ తేదీ సాయంత్రం శ్రీ గంగాపార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి వార్లకు పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. -
అందరం భగవంతుడి సేవ చేద్దాం – మోహన్‌బాబు
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరే.. నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్‌ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
నరసింహకొండ గిరి దర్శనానికి కృషి
నెల్లూరు(అర్బన్): నరసింహకొండ చుట్టూ రోడ్డును ఏర్పాటు చేసి గిరి దర్శనానికి వీలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నరసింహకొండపై కొలువైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ నూతన చైర్మన్ మల్లినేని వెంకటేశ్వర్లునాయుడు, సభ్యులు దైవసన్నిధిలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆదాల మాట్లాడారు. ఆలయానికి 1348 ఎకరాల భూమి ఉందని, ఈ ఆస్తులను నూతన కమిటీ పరిరక్షిస్తూ ఆదాయ పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. కొండపైకి బస్సు సౌకర్యాన్ని కల్పించేలా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. అనంతరం ఆదాలను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. టీడీపీ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు అధ్యక్షత వహించిన సభలో పార్టీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నాయకులు హరిబాబుయాదవ్, హంసకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అసంతృప్తి స్థానిక ఎంపీటీసీగా ఉన్న తనను వేదికపైకి ఆహ్వానించలేదని సునీల్ పలువురు టీడీపీ నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మహానందీశ్వరుడి భక్తులకు రుచికర భోజనం
- పోలీసు స్టేషన్ వెనుక పార్కింగ్ - పెద్దనంది వద్ద క్షురకుల షాపుల ఏర్పాటు - పాలకమండలి సమావేశంలో తీర్మానాలు మహానంది : మహానందీశ్వరుడి దర్శనార్థం వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మహానంది దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్‌లు పేర్కొన్నారు. మహానందిలోని దేవస్థానం కార్యాలయంలో శుక్రవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానందిలో ప్రస్తుతం 125 మందికి మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నామని, ఇక నుంచి ప్రతిరోజు 300 మందికి అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం అన్నం, రసం, మజ్జిగ ఇచ్చేవారని, ఇక నుంచి స్వీటు, చట్నీ, కర్రీ, పప్పు, సాంబారు, మజ్జిగ అందించి భక్తులకు ఆకలి తీర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఆలయ పరిధిలో ఉన్న క్షురకుల షాపులను పెద్ద నంది విగ్రహం వద్దకు మారుస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందులు వాహనాల పార్కింగ్‌ను పోలీసుస్టేషన్ వెనుక, మహానంది తహాసీల్దార్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహానంది అభివృద్ధికి విశేష కృషి చేసిన మహానందయ్య విగ్రహం ఏర్పాటుకు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు బాలరాజు, రామకృష్ణ, చింతకుంట్ల శివారెడ్డి, బండి శ్రీనివాసులు, చంద్రమౌళీశ్వరరెడ్డి, సీతారామయ్య, ఆలయ సూపరింటెండెంట్లు ఈశ్వర్‌రెడ్డి, పరశురామశాస్త్రి, అన్నదాన పథకం ఇన్చార్జ్ పార్వతీ, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.