
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు.
విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు వీరే..
నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్‌ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment