‘‘నటుడిగా నేను 40 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నన్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దాసరిగారి సమక్షంలో వైజాగ్‌లో ఫంక్షన్ చేశారు టీయస్సార్. కళాకారులను గౌరవించాలనే ఆలోచన రావడం మామూలు విషయం కాదు. ఈ ఆలోచన వచ్చిన వ్యక్తి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో వన్ అండ్ వోన్లీ పర్సన్ టీయస్సార్. ఇది డబ్బుతో కూడుకున్న విషయం కాదు. మనసు ఉండాలి. అభినందనలు వేరు కానీ నాకు ఈ బిరుదు (విశ్వ నట సార్వభౌమ) ప్రదానం చేయటం ఇబ్బందిగా అనిపించింది. టీయస్సార్ నేను ఊళ్లో లేనప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత నీకీ బిరుదు ఇస్తున్నాం అంటే కాదనలేకపోయాను’’ అన్నారు మంచు మోహన్‌బాబు. టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూర్, ముంబై, ఢిల్లీ.. ఇలా పలు ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ 17న హైదరాబాద్‌లో ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టీయస్సార్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 600 ఏళ్ల క్రితం ఓరుగల్లు ముఖ్య పట్టణంగా కాకతీయ రాజులు తెలుగు కళలను, నాగరికతను అద్భుతంగా ప్రోత్సహించారని ప్రసిద్ధి. వారి పాలన స్వర్ణ యుగం అని కవులు వర్ణించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో ప్రోత్సహించారు. ఈసారి మేం టీయస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఏర్పాటు చేశాం. తెలంగాణ ముఖ్య ప్రాంతాలలో కాకతీయ కళా వైభవోత్సవాలు చేయాలి, తెలుగు ప్రజల్ని మరోసారి రంజింపజేయాలని నిశ్చయించుకున్నాం. ఇందులో భాగంగా ముందు హైదరాబాద్‌లో ఈ నెల 17న భారీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. 42 ఏళ్లుగా ఏకధాటిగా నటిస్తూ, 560 సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి, తనకంటూ ఓ స్థాయి క్రియేట్ చేసుకున్న మోహన్‌బాబుకు ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదును ప్రదానం చేయబోతున్నాం. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుగారు వస్తున్నారు’’ అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘సుబ్బిరామి రెడ్డిగారి ఇంటి పేరు ‘టి’ అని కాకుండా కళా అని పెట్టి ఉంటే బావుండేది. కళాకారులను సత్కరించి తాను సంతృప్తి పొందుతుంటాడు. కాకతీయ శబ్దాన్ని కళా పరిషత్‌లోకి తీసుకొచ్చారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన రాజ్యాధినేత రుద్రమదేవి. కాకతీయ ద్వారంలోనే కళ కనపడుతుంది. మోహన్‌బాబు తెర మీద కనపడగానే ఈలలు కొడతారు. ఆయన మమల్ని ఆప్యాయంగా అగ్రజా అని పిలుస్తుంటారు. ఆయనకు సన్మానం జరుగుతుంది అంటే మాకు జరిగినట్టే. ఆ బిరుదుకు మోహన్‌బాబు అర్హుడు’’ అన్నారు. రాజేంద్రప్రసాద్, విష్ణు, మనోజ్, పోసాని కృష్ణమురళి, అలీ, జయప్రద, జయసుథ, లక్ష్మీప్రసన్న, శ్రియ తదితర సినీరంగ ప్రముఖులు, మధుసూ«ధనాచారి, కె. స్వామిగౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
అందుకే మోహన్‌బాబు ‘నట విశ్వ సార్వభౌమ’ – టీయస్సార్
Published Sun, Jan 14 2018 12:54 AM | Last Updated on Sun, Jan 14 2018 12:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment