నాగాయలంక(అవనిగడ్డ): వివాహిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశామని అవనిగడ్డ సీఐ ఎల్.రమేష్ తెలిపారు. నాగాయలంక పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు వివరాలను మంగళవారం విలేకరులకు తెలిపారు. సీఐ కథనం మేరకు.. నాగాయలంక గ్రామానికి చెందిన నాగిడి దుర్గ (30), ఆదే గ్రామానికి చెందిన యతిరాజుల ప్రకాష్ ప్రేమించుకుని పదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. దుర్గ గ్రామంలోని భూషయ్య హోటల్‌లో పనిచేస్తోంది.
గైడ్ స్వచ్ఛంద సంస్థ తరఫున దుర్గ పనిచేస్తూ హెచ్‌ఐవీ రోగులను బందరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమెను అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామానికి చెందిన హేమంత్ అనుసరించడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించే వాడు. దుర్గ భర్త ప్రకాష్‌కు ఈ విషయం తెలియ డంతో హేమంత్‌ను మందలించాడు. అయినా ప్రవర్తన మార్చుకోని హేమంత్ ఈ నెల ఆరో తేదీన నాగాయలంక సెంటర్‌లోని భూషయ్య టిఫిన్ హోటల్ వద్దకు వెళ్లి తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరడంతో దుర్గ గట్టిగా మందలించింది.
తనను తిట్టిన దుర్గ అంతు చూస్తానంటూ హేమంత్ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే ఎనిమిదో తేదీ రాత్రి భూషయ్య హోటల్‌లో వెనుక వైపు ఆమె పని చేసుకుంటున్న సమయంలో హేమంత్ గోడ దూకి వచ్చాడు. వెంట తెచ్చుకున్న చాకుతో దుర్గ ఎడమ వైపు ఛాతీ కింద పొడిచి హత్య చేశాడు. దుర్గ భర్త ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అవనిగడ్డ సీఐ రమేష్ ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం, సిబ్బంది సహకారంతో నిందితుడు హేమంత్‌ను సోమవారం సాయంత్రం పులిగడ్డ బస్ స్టాప్ వద్ద అదుపులోనికి తీసుకుని, హత్యకు ఉపయోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు. సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. నిందితుడిని మంగళవారం అనంతరం అవనిగడ్డ కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment