రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థికంగా ఎదగాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అన్నీ వ్యాపార సంస్థలుగా రాణించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ డి.కె.బాలాజీ ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం జిల్లాలోలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థల సీఈఓలు, బోర్డు డైరెక్టర్లు, సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. సంస్థలోని ప్రతి రైతూ వ్యాపారవేత్తగా ఎదిగేలా ఆలోచన చేయాలని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఎన్.పద్మావతి, జై.జ్యోతి, డీఆర్డీఏ పీడీ సాయిబాబు, నాబార్డ్ బ్యాంక్ ఏజీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి, డీసీఓ చంద్రశేఖర్, ప్రకృతి వ్యవసాయ డీపీఎం పార్థసారథి, బాపట్ల వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్త వాసుదేవరావు, మైక్రో ఇరిగేషన్ పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్ రాయితీలపై ప్రచారం అసత్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ీసనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీని రైల్వేశాఖ పునరుద్ధరించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గతంలో రైల్వేశాఖ సీనియర్ సిటిజన్‌లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ ఇచ్చేదని, 2020 మార్చి నుంచి కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి రాయితీని పునరుద్ధరించలేదని స్పష్టంచేశారు. కొన్ని సోషల్ మీడియాల్లో మాత్రం రాయితీపై తప్పుడు ప్రచారం జోరుగా సాగడంతో సీనియర్ సిటిజన్లలో కొంత అయోమయం నెలకొందని వివరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్‌సైట్‌లు లేదా అధీకృత మీడియాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.
రైల్వే ప్రయాణికులను గాయపరిచి చోరీ చేసే నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ ఔటర్‌లో కదులుతున్న రైలులో ఫుట్‌బోర్డుపై ఉండే ప్రయాణికులను కిందకు లాగి, వారిపై బ్లేడుతో దాడి చేసి నగదు, సెల్ ఫోన్‌లు చోరీ చేసే ఇద్దరు నిందితులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు, మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ జి.వి.రమణ కథనం మేరకు.. ఈ నెల రెండో తేదీన శ్రీనివాసరావు అనే వ్యక్తి తెనాలి నుంచి విజయవాడకు రైలులో బయలుదేరాడు. ఆ రైలు బస్‌స్టేషన్, పూలమార్కెట్ సమీపంలోకి రాగానే కొంత మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు అతడిని కిందకి లాగి బ్లేడుతో గాయపర్చి పర్సు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. మరుసటి రోజు కూడా ఇదే తరహాలో పవన్ కుమార్‌ను బ్లేడుతో గాయపర్చి అతని వద్ద సెల్‌ఫోన్ దోచుకున్నారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాలతో జీఆర్‌పీ డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో సీఐ జి.వి.రమణ ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చోరీలకు పాల్పడిన వారిలోని ఒక మైనర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురు యువకులతో కలసి బ్లేడుతో దాడిచేసి చోరీలకు పాల్పడినట్లు తెలిపాడు. మైనర్ ఇచ్చిన సమాచారంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నీటి రాజేష్‌ను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment