అధికారుల సమావేషాలు!
పెడన: ఇంటర్‌మీడియెట్ విద్యాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా అధికారిక సమావేశాలు జిల్లా కేంద్రంలో నిర్వహించడం పరిపాటి. అయితే అందుకు భిన్నంగా ఇంటర్ అధికారులు ఉయ్యూరు కేంద్రంగా సమావేశాలు నిర్వహిస్తూ విధానపరమైన నిర్ణయాలు చేస్తున్నారు. ఇటీవల ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ముందు సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఉయ్యూరులోనే నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్ పరీక్షల నిర్వహణపై కూడా ఇక్కడే సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఒకటో తేదీ నుంచి పరీక్షలు..
మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లాలోని ఆర్‌ఐవోలు, డీఐఈవోలు జిల్లా కేంద్రాల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటు అధికారులు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు ఇలా 150 మందికిపైగా సిబ్బందిని నియమించారు. వీరందరికీ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో కాకుండా ఉయ్యూరులో సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రైవేటుకు మేలు చేసేందుకేనా?
వాస్తవంగా జిల్లా కేంద్రంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించి జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించాలి. కానీ ఇంటర్మీడియెట్ అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడం, జిల్లా కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడం విమర్శలకు తావిస్తోంది. అదీ కాకుండా ప్రైవేటు కళాశాలలను ఎన్డీయే కూటమి అందలం ఎక్కించడమే లక్ష్యంగా పావులు కదుపుతుందనే విషయానికి ఈ సమావేశం బలం చేకూర్చుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పనిచేసిన ఇంటర్ ఉన్నతాధికారులు జిల్లా కేంద్రంలోనే సమావేశాలు నిర్వహించి పరీక్షల సిబ్బందికి మార్గదర్శకాలను జారీ చేసేవారు. కానీ ఇప్పుడున్న అధికారి మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా జిల్లా కేంద్రానికి ఎక్కడో దూరంగా ఎన్టీఆర్ జిల్లాకు దగ్గరగా ఉన్న ఉయ్యూరులో సమావేశాలను నిర్వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరో పక్క జిల్లా కేంద్రానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన జిల్లా అధికారులు జిల్లా కేంద్రాన్ని వదిలిపెట్టి ఉయ్యూరులో సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. కావాలని జిల్లా కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారనే పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
రాత మారని బందరు..
ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్న సమయంలో మచిలీపట్నం కేంద్రంగా ఉన్నా.. విజయవాడలోనే అత్యధికంగా జిల్లా అధికారులుండే వారు. దీంతో విజయవాడలోనే సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం జిల్లాలు విడిపోయినా, అధికారులు జిల్లా కేంద్రాల్లో ఉంటున్నా కూడా జిల్లా కేంద్రంగా మచిలీపట్నాన్ని గుర్తించకపోవడం విడ్డూరంగా ఉంది.
ఇంటర్ విద్యాధికారుల రూటే సెపరేటు
జిల్లా కేంద్రం వైపు చూడని అధికారులు సమావేశాలన్నీ ఉయ్యూరులోనే.. జిల్లా కేంద్రంలోనే పెట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ ప్రైవేటు కళాశాలలకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు కలెక్టర్ ప్రమేయాన్ని తగ్గించడం పైనా విమర్శలు
జిల్లా కేంద్రంలోనే నిర్వహించాలి..
ఇంటర్ పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులకు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు, కస్టోడియన్లకు సమావేశం జిల్లా కేంద్రంలోనే పెట్టాలని స్పష్టం చేశాం. అయితే ఆ రోజు అంటే 23న గ్రూపు–2 పరీక్ష ఉందన్నారు. 22న పెట్టుకోవాలని చెప్పాం. బందరులోని హిందూ కళాశాల, నోబుల్ కళాశాలలున్నాయి. వాటిల్లో సమావేశం పెట్టుకోవాలని ఆదేశించాం. – వీవీ సుబ్బారావు,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియెట్
Comments
Please login to add a commentAdd a comment