అవయవదానమిచ్చి.. ఆదర్శంగా నిలిచి..
భవానీపురం(విజయవాడపశ్చిమ): అవయవ దానంతో కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన ముత్యాల సరస్వతి (55) జీవితం ధన్యమైంది. విజయవాడ గొల్లపూడి బైపాస్ రోడ్‌లోని బాలాజీ టవర్స్‌లో నివసిస్తున్న ముత్యాల సరస్వతి, ఆమె కుమారుడు ముత్యాల రామ్‌కుమార్ ఈ నెల 14న బైక్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సరస్వతి తలకు దెబ్బతగిలి తీవ్రంగా గాయపడింది. దాంతో రామ్‌కుమార్ తల్లిని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్సకు స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు 19వ తేదీన వైద్యులు ప్రకటించారు. ముత్యాల సరస్వతి అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు.
చిరస్మరణీయురాలు..
విషయం తెలిసి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా హాస్పిటల్‌కు వచ్చి మృతురాలికి పుష్పాంజలి ఘటించారు.
చనిపోతూ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన సరస్వతి చిరస్మరణీయురాలని కొనియాడారు. ఆమె దేహం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లు సేకరించామని తెలిపారు. కళ్లను ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు అప్పగించామని చెప్పారు. మృతురాలి కుటుంబసభ్యులకు జీవన్‌దాన్ సర్టిఫికెట్, రూ.10వేలు అందించామని, అయితే ఆ మొత్తాన్ని పేదల వైద్య సేవలకు ఖర్చు చేయాలని ఆమె కుమారుడు రామ్‌కుమార్ తిరిగి హాస్పిటల్‌కే ఇచ్చేశారని పేర్కొన్నారు. అనంతరం సరస్వతి మృతదేహాన్ని గొల్లపూడిలోని ఆమె నివాసానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
వెలంపల్లి నివాళులు..
సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం సరస్వతి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ముత్యాల రామ్‌కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, బాపతి కోటిరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, నాయకులు పదిలం రాజశేఖర్, వెలది అనిల్ శర్మ, పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు. కాగా గురువారం విద్యాధరపురంలోని హిందూ స్మశానవాటికలో సరస్వతి అంత్యక్రియలు నిర్వహించారు.
మరో నలుగురికి
పునర్జన్మనిచ్చిన మహిళ
అవయవదానమిచ్చి.. ఆదర్శంగా నిలిచి..
Comments
Please login to add a commentAdd a comment