మర్చిపోయిన బ్యాగ్ మహిళకు అప్పగింత
భవానీపురం(విజయవాడపశ్చిమ): బంగారు ఆభరణాలు, నగదు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయిన ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి తిరిగి వాటిని అప్పగించారు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిళ్లా పార్వతి, దుర్గారావు దంపతులు చిట్టినగర్ సొరంగం దగ్గర నివసిస్తున్నారు. ఈ క్రమంలో పార్వతి తన కుటుంబసభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విజయనగరం వెళ్లారు. తిరిగి గురువారం ఉదయం 10 గంటల సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ వద్ద దిగి బయటకు వచ్చారు. అక్కడ ఆటోను కిరాయికి మాట్లాడుకొని చిట్టినగర్ సొరంగం దగ్గర ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఆటో దిగే సమయంలో పార్వతి తన హ్యాండ్ బ్యాగ్‌ను ఆటోలోనే మరిచి పోయారు. అందులో ఐదు తులాల బంగారు వస్తువులు, పది వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే ఆమె కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తక్షణమే సీఐ చిన కొండలరావు తమ సిబ్బందిని విచారణకు పంపారు. బాధితురాలు ఆటో ఎక్కిన సమయం, దిగిన సమయం తెలుసుకున్నారు. అలాగే ఆయా ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆటో డ్రైవర్ నున్న దగ్గర కండ్రిక వెళ్లిపోగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతని ఆటోను గుర్తించారు. ఫిర్యాదులో పేర్కొన్న బంగారపు వస్తువులు, నగదు, ఫోన్ స్వాధీనం చేసుకుని ఆమెకు తిరిగి ఇచ్చారు.
మర్చిపోయిన బ్యాగ్ మహిళకు అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment