జోరు తగ్గుముఖం
జిల్లాలో 10 నుంచి 40 శాతం అదనంగా భూముల ధరలు పెంపు
సగటున 20శాతం చార్జీలు
ప్రజలు వెనుకంజ
జిల్లాలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు
గుడ్లవల్లేరు: జిల్లాలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. రిజిస్ట్రేషన్ల జోరు తగ్గుముఖం పట్టడానికి భూముల ధరల పెంపే కారణమని తెలుస్తోంది. జనవరి నెలలో కృష్ణా జిల్లాలో 9,439 రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.48.62లక్షల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరిలో భూముల ధరల పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరిగాయి. దీంతో ఈ నెలలో 6,924 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడంతో కేవలం రూ.20.86 లక్షల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. అందుకు అడ్డగోలుగా కూటమి ప్రభుత్వం పెంచేసిన భూముల ధరలే ప్రధాన కారణమన్న విమర్శలు జిల్లా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 10 నుంచి 40 శాతం అదనంగా భూముల ధరలను పాలకులు పెంచేశారు. సగటున 20శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్లకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.
సంపద సృష్టి పేరుతో ఇష్టారాజ్యంగా ధరల పెంపు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పాలకులు సంపద సృష్టి పేరిట ఇష్టారాజ్యంగా ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు భారీ పెరుగుదలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. తాజాగా భూముల రిజిస్ట్రేషన్ల ఫీజును పెంచేసి కొత్త బాదుడుకు శ్రీకారం చుట్టారు. దీంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్ల సంఖ్య తగ్గింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా 10 నుంచి 40 శాతం వరకు భూముల ధరలను పెంచేసి.. రిజిస్ట్రేషన్ల ధరలు కూడా సగటున 20శాతానికి ఈ నెల ఒకటో తేదీ నుంచి పెంచేశారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భూములు, నివాసాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాల విలువలు అమాంతంగా పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వ విధానంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీగా చార్జీలు
అర్బన్‌లో 35శాతం, రూరల్‌లో 40 శాతం వరకు భూముల విలువలు పెంచారు. అధిక శాతం పట్టణ ప్రాంతాల్లో 20శాతానికి పైగా ధరలు అధికమైతే.. అధిక శాతం మండలాల్లో 30 శాతానికి పైగా పెరిగాయి. తాజా పెంపుతో కొన్ని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే.. ప్రభుత్వ ధర ఎక్కువగా ఉన్నట్లు రియల్టర్లు చెబుతున్నారు.
సామాన్యులకు సమస్యే
బిడ్డల చదువులు, వివాహాలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఉన్న కాస్త ఆస్తిని అమ్మకానికి పెట్టినా.. కొనేవారు లేక సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో నెలకు ఒక్క ప్లాట్ అయినా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనపడటం లేదు.
అప్పులు చేసి వెంచర్లు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుతో పరిస్థితి మరింత దిగజారిందన్న ఆందోళనలో బాధితులు ఉన్నారు.
బాబు హామీ.. నీటిమూట
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోమంటూ గారడీ మాటలు చెప్పిన చంద్రబాబు ఎన్నికల హామీ నీటి మూటలా మారింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే జనాలపై ఆర్థిక భారం వేశారు. జిల్లాలో పెరిగిన 20 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటుగా అమల్లోకి వచ్చింది. ప్రజలపై పెంచిన భారాన్ని తన సంపద సృష్టిలా బాబు భావించడంపై సర్వత్రా వ్యతిరేకతలు వస్తున్నాయి.
కొత్త ధరలతో రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్లపై పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూములు, ఇతర ఆస్తుల విలువలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధరలు పెరుగుతుండటంతో గత కొద్ది రోజులుగా రిజిస్ట్రేషన్ల సంఖ్యలో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం పెంచిన ధరల ప్రకారం జిల్లాలో సగటున 20శాతం వరకు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి. – ఎం.ఎస్.జి.కె.మూర్తి, జిల్లా రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment