వ్యాపారాలు లేవు! | - | Sakshi
Sakshi News home page

వ్యాపారాలు లేవు!

Published Sat, Feb 22 2025 1:43 AM | Last Updated on Sat, Feb 22 2025 1:38 AM

వ్యాపారాలు లేవు!

వ్యాపారాలు లేవు!

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ‘కరవమంటే కప్పకు కోపం... అరవమంటే పాముకు కోపం’ సామెత చందాన తయారైంది ఉమ్మడి కృష్ణాజిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పరిస్థితి. కూటమి సర్కార్‌ విధానాలతో ఉమ్మడి జిల్లాలో వ్యాపారాలు లేక ఆ శాఖకు రావాల్సిన ఆదాయానికి గండి పడింది. అయితే ‘‘ఆదాయం తగ్గితే ఎలా...? ప్రభుత్వానికి డబ్బులు తెచ్చే శాఖలో రెవెన్యూ పడిపోతే బాగుండదు. మీరు ఏం చేస్తారో తెలియదు ఆదాయం పెరగాల్సిందే...’’ అంటూ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెడుతున్నారు. గడిచిన తొమ్మిది మాసాలుగా వ్యాపారాలు లేక జీఎస్‌టీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.

వ్యాపారాలు పూర్తిగా దిగజారిన వైనం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారాలు పూర్తిగా దిగజారాయి. ప్రధానంగా కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయకత్వంలో అమలు చేస్తున్న విధానాలతో అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపుతోందని వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు చెబుతున్నారు. వ్యాపారాలు లేకపోవటంతో పలువురు వ్యాపారులు దివాలా తీసే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరంలో అత్యధికంగా జరిగే వస్త్రాలు, బంగారం, కిరాణా తదితర రంగాలకు సంబంధించిన వ్యాపారాలు లేకపోవటంతో ఆ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గడిచిన పండుగ సీజన్‌లో తమ వ్యాపారాలకు భారీగా గండి పడిందని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. దానికి తోడు ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లోనూ వ్యాపారం లేకుండా పోయిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పడకేసిన నిర్మాణరంగం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా ఆదాయం వచ్చే రంగం సిమెంట్‌ పరిశ్రమ. దానికి తోడు ఇతర నిర్మాణ అనుబంధ రంగాల నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంచనా. అయితే సిమెంట్‌ అమ్మకాలు గత ఏడాది మీద 30 నుంచి 35 శాతం పడిపోయాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఆ మేర వాణిజ్య పన్నుల శాఖ అధికారుల లెక్కలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. దాంతో నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే ఇతర రంగాల అమ్మకాలు కూడా దిగజారాయి. ఈ రంగాలపై ఆధారపడిన కార్మికులు, ప్రజానీకం సైతం సరైన ఆదాయం లేక అల్లాడుతున్నారు.

ఆటోమొబైల్‌ రంగానికీ అదే పరిస్థితి

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సిమెంట్‌ పరిశ్రమతో పాటుగా భారీగా ఆదాయం వచ్చే మరో రంగం ఆటోమొబైల్‌ పరిశ్రమ. ఈ రంగం నుంచి సైతం ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్‌టీ వసూళ్లు పూర్తిగా దిగజారిపోయాయి. విజయవాడ–3 డివిజన్‌ పరిధిలో దాదాపుగా ఆటోమొబైల్‌ నుంచి అత్యధికంగా ఆదాయం ఉంటుంది. ఈ రంగం పూర్తిగా పడకవేయటంతో ఆదాయం టార్గెట్‌ దేవుడెరురు కనీసం గత ఏడాది వచ్చిన రెవెన్యూ సైతం వచ్చే పరిస్థితులు లేవని సర్కిల్‌ స్థాయి అధికారులు చెబుతున్నారు.

వాణిజ్య పన్నుల శాఖ సమీక్షలో జిల్లా అధికారుల వెల్లడి గత ఏడాది ఆదాయం సైతం రాని వైనం గత ఏడాదిపై 30 శాతం అధికంగా టార్గెట్‌ చేయాలంటూ హుకుం తలలు పట్టుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధికారులు

ఉమ్మడి జిల్లాకు రూ.6500 కోట్లు టార్గెట్‌

ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివి జన్‌, విజయవాడ–2 డివిజన్‌, విజయ వాడ–3 డివిజన్‌గా వాణిజ్య పన్నుల శాఖ పని చేస్తుంది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ –1,విజయవాడ–2 డివిజన్లుగా ఉండగా కృష్ణాజిల్లాలో అధిక భాగంగా విజయ వాడ–3 డివిజన్‌ పరిధిలో కొనసాగుతోంది. మూడు డివిజన్ల పరిధిలో 17 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా సరాసరిన సుమారు నాలుగు నుంచి రూ.4500 కోట్ల మేర వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది ఆ శాఖ ఆరున్నర వేల కోట్ల మేర ఉమ్మడి జిల్లా నుంచి ఆదాయం రావాలని టార్గెట్‌ పెట్టారని, లేకుంటే కనీసం ఆరు వేల కోట్లకు రిచ్‌ కావాలంటూ ఒత్తిడి పెడుతున్నట్లుగా సమాచారం. కానీ జనవరి మాసాంతానికి కనీసం నాలుగు వేల కోట్ల ఆదాయం కూడా దాటకపోవటంతో ఆ శాఖ అధికారులపై మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలసింది. అది కూడా పాత బకాయిలపై దృష్టి పెట్టడంతో ఆ మాత్రం ఆదాయమైనా వచ్చిందని ఒకరిద్దరు అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం గత ఏడాది ఆదాయం సైతం వచ్చే పరిస్థితులు లేవని ఆ శాఖ ఉద్యోగ సంఘ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement