చిన్నారి ప్రాణాలు తీసిన పంఖా
జి.కొండూరు: అసలే పేద కుటుంబం. పొట్ట చేతబట్టుకొని ఆ భార్య, భర్తలిద్దరూ పిల్లలతో కలిసి ఇటుక బట్టీలో పనికి వచ్చారు. పిల్లల భవిష్యత్తును కలలు కంటూ, బట్టీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు విషాదంలోకి నెట్టింది. ఇంట్లో వెలుగులు నింపాల్సిన విద్యుత్ ఆ ఇంట్లో చీకట్లు కమ్మేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే...బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, పెద్దపాలెం గ్రామానికి చెందిన ఇందుమూడి రవి తన భార్య కల్పన, కుమార్తె మంజూష, కుమారుడు యశ్వంత్(6)తో కలిసి గత డిసెంబరులో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో పని చేసేందుకు వచ్చారు. గురువారం అర్థరాత్రి కుటుంబం అంతా గాఢ నిద్రలో ఉండగా యశ్వంత్ చేయి స్టాండ్ ఫ్యానుకు తగిలింది. అయితే ఆ ఫ్యానుకు విద్యుత్ సరఫరా అవడంతో యశ్వంత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే నిద్రలేచిన తండ్రి రవి, కొడుకును తప్పించబోయి తాను కూడా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి రవి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు రవిని మైలవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రవికి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లమందే చనిపోవడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మైలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో బాలుడి దుర్మరణం
చిన్నారి ప్రాణాలు తీసిన పంఖా
Comments
Please login to add a commentAdd a comment