
రక్త నిల్వల కొరత!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రాణాధారమైన రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. ఏ బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లినా నో స్టాక్, నో బ్లడ్ అన్న సమాధానమే. జిల్లాలో రక్త నిల్వల కొరత ఎదురవుతోంది. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు బ్లడ్ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా నిరాశే ఎదురవుతోంది. ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
నో స్టాక్.. నో బ్లడ్
జిల్లాలో తొమ్మిది బ్లడ్ బ్యాంకుల పరిధిలో 2023– 24లో మొత్తం 19,550 యూనిట్ల రక్తసేకరణ జరిగింది. 2024– 25 ఫిబ్రవరి నెల వరకు 12,845 యూనిట్లు మాత్రమే సేకరణ చేశారు. ఏటా మే, జూన్ నెలల్లో రక్తం కొరత అధికంగా ఉంటోంది. అయితే ఈ ఏడాది మార్చిలోనే ‘కొరత’ ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి బ్లడ్ బ్యాంక్ రోజుకు 5 నుంచి 15 యూనిట్ల వరకూ రోగులకు రక్తం అందిస్తుంటాయి. ప్రధానంగా రక్తం నిల్వచేసే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో నో స్టాక్.. నో బ్లడ్ అన్న సమాధానం ఎదురవుతోంది. శనివారం వరకు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో కేవలం మూడు యూనిట్లు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 20 యూనిట్లు, కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సింగిల్ యూనిట్లు, మరికొన్ని చోట్ల నిల్వలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నిరాశే..
రక్తం కొరత ప్రభావం.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా పడుతోంది. తలసేమియా వంటి రోగులు రక్తదాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. బ్లడ్ కోసం ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. గర్భిణులు, యాక్సిడెంట్స్‌లో గాయాల పాలైన వారు రక్తం కోసం పరుగులు పెడుతున్నారు. అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది.
వేసవిలో ఇబ్బందే..
రోగుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్ని రకాల శస్త్రచికిత్సలను వేసవిలోనే నిర్వహిస్తారు. వీటి నిర్వహణకు కూడా రక్తం యూనిట్లు నిల్వల అవసరం మరింత పెరుగుతోంది. సాధారణంగా రక్తం సేకరణకు కళాశాలలు, పలు సంస్థల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం వాటి నిర్వహణ ఊసే లేదు. రానున్నది వేసవి కావడంతో ప్రజలు రక్తదానం చేయడానికి విముఖత చూపుతారు. కళాశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. ఇలాంటి కారణాలతో రక్త నిల్వలు తగ్గిపోతాయి. దీంతో సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు వైద్యులు అంటున్నారు.
ప్రజల్లో అవగాహన పెరగాలి..
ప్రముఖల జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదాన సేకరణను పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. రక్తం నిల్వల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
రక్తదాతలూ.. రండి ఏటా వేసవిలో సమస్య
ఈ ఏడాది మార్చిలోనే నిల్వలు తగ్గడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యే అవకాశం
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
గడిచిన కొద్దిరోజుల నుంచి ఎండ తీవ్రత అధికం కావడం, విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావడంతో రక్త సేకరణ తగ్గింది. రోగుల అవసరం మేరకు యూనిట్లను సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిల్వలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
–హనుమంతయ్య, మెడికల్ ఆఫీసర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, మచిలీపట్నం

రక్త నిల్వల కొరత!

రక్త నిల్వల కొరత!