జి.కొండూరు: ప్రాచీన కళలు ఆదరణ కోల్పోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కళాసంస్థల కృషి కారణంగానే అక్కడక్కడ ఈ కళలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాచీన యుగం నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, మూఢాచారాలు, సామాజిక సమస్యల పరిష్కారం, స్వాతంత్రోద్యమం, ప్రజా ప్రయోజన ఉద్యమాల్లో ప్రజల్లో ఆలోచన, చైతన్యం, అవ గాహన కల్పించడంలో కళారంగానికి ప్రత్యేక స్థానం ఉంది. టీవీలు, థియేటర్‌ల రాకతో వాటికి ఆదరణ కరువైంది. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ల కారణంగా సోషల్ మీడియా, సినిమా, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోల వైపు ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసిన ప్రాచీన కళారంగం నిరాదరణకు గురైంది. వాటికి జీవం పోయాల్సిన ప్రభుత్వాలు సైతం రంగస్థల దినోత్సవాల్లో హామీలు గుప్పించడం మినహా ప్రోత్సాహం ఇస్తున్న దాఖలాలు లేవు. కాలంతో పోటీ పడుతూ ప్రాచీన కళారంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటక రంగ కళాకారులు కొందరు ఆరాటపడుతున్నారు. గురువారం ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాకారులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు.
మైలవరంలో నాటకరంగ
ఆనవాళ్లు
ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో పూర్వం జమీందార్లు నాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని చరిత్ర చెబుతోంది. మైలవరం రెండో రాజుగా ప్రసిద్ధి చెందిన రాజా సూరానేని వెంకటపాపయ్యారావు బహుద్దూర్ 1912లో మైలవరం కంపెనీ అని పిలవబడే ‘బాలభారతి నాట్యమండలి’ని స్థాపించారు. ఆయన ఈ సమాజం ద్వారా నాటక రంగాన్ని, కళాకారులను ఎంతగానో ప్రోత్సహించారు. 1917, 1918లో బెజవాడలో ‘మైలవరం థియేటర్’ నిర్మించిన తర్వాత ఈ నాటక సమాజాన్ని అక్కడికి తరలించి ఎందరో ప్రముఖ కళాకారులకు వేతనాలు చెల్లించి ప్రోత్సహించారు. మైలవరం బాలభారతి నాటక సమాజ ప్రదర్శన అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు ఉండేదని కళాకారులు చెబుతున్నారు. ఈ నాటక సమాజంలో యడవల్లి సూర్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు, దైతా గోపాలం, ఉప్పులూరి సంజీవరావు, గోవిందరాజుల వెంకట్రామయ్య వంటి ఎందరో సుప్రసిద్ధ కళాకారులు పనిచేశారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలో...
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రాచీన కళలకు ప్రత్యేక స్థానం ఉంది. పౌరాణిక పద్య నాటకం, చారిత్రక , జానపద నాటకాలు, సాంఘిక నాటకాలు, పరిషత్తు నాటకాలు, హరికథ, బుర్రకథ, జముకుల కథ, చెక్క భజన, తోలు బొమ్మలాట, డప్పు కళలు ఇలా అన్ని ప్రాచీన కళలకు చెందిన నాలుగువేల మంది వరకు కళాకారులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్నారు. వీరిలో నాటక రంగానికి చెందిన కళాకారులు 1500 మంది ఉన్నారు. వీరు కాక కోలాటం వంటి వివిధ కళలకు చెందిన కళాకారులు అదనం.
పూర్వ వైభవానికి కృషి
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన నాటక, సినీరంగ కళాకారులు పోలుదాసు రంగనాయకులు, పోలుదాసు శ్రీనివాసరావు సోదరులు ‘ఆదర్శ గ్రామీణ సాంస్కృతిక సేవా సంస్థ’, ‘వెలగలేరు థియేటర్ ఆర్ట్స్’ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నాటక సమాజాలను ఆహ్వానించి నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. సోదరుల్లో ఒకరైన పోలుదాసు రంగనాయకులు 50కి పైగా నాటకాల్లో విభిన్న పాత్రలు పోసిస్తూ రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన నాటకరంగానికి జీవం పోసేందుకు కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించడం, సీనియర్ కళాకారులను సన్మానించడం వంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. పోలుదాసు శ్రీనివాసరావు వినూత్న కథాంశంతో నాటికలు రచించి, కళాకారులకు శిక్షణ ఇచ్చి, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇప్పిస్తుంటారు. ఇదే మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన నాటక, సినీ రంగ కళాకారుడు వీరంకి వెంకట నర్సింహారావు ‘చైతన్య కళా స్రవంతి’ సంస్థను స్థాపించి గ్రామంలో నాటకోత్సవాలను నిర్వ హిస్తున్నారు.
ప్రభుత్వాల ఆదరణకు నోచుకోని ప్రాచీన కళలు
స్వచ్ఛందంగా నాటక రంగానికి
జీవం పోస్తున్న కళాకారులు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1500 మంది నాటకరంగ కళాకారులు
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
రంగు వెలుస్తున్న రంగస్థలం