
డీలిమిటేషన్‌పై అఖిలపక్షం ఏర్పాటు చేయండి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కృష్ణలంక(విజయవాడతూర్పు): డీలిమిటే షన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ్ భవన్‌లో జన చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన సోమవారం డీలిమిటేషన్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల చైన్నెలో డీలిమిటేషన్‌పై జరిగిన సదస్సుకు టీడీపీ, జనసేన హాజరు కాకపోవడం, రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనక పోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి గణనీయంగా డీలిమిటేషన్ సదస్సులో పాల్గొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్ తులసీరెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దేశ సమైక్యతకు సమగ్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్‌పై తీర్మానం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సీపీఐ సీనియర్ నేత ఎ.వనజ, కాంగ్రెస్ నేత ఎన్.నరసింహారావు, కె.శివాజీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.ఆంజనేయులు, సామాజిక విశ్లేషకులు డాక్టర్ కె.వసుంధర తదితరులు పాల్గొన్నారు.