
ఆలయం.. వివాదాలమయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని రెండో అతి పెద్ద దేవస్థానమైన దుర్గగుడిని కొద్ది రోజులుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆలయ బాధ్యతలు నిర్వహించే ఈవో స్థానంలో ఉన్న కె. రామచంద్రమోహన్‌కు దేవదాయ శాఖలో మరో రెండు కీలక స్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో దుర్గగుడిపై పాలన అదుపు తప్పుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని పరిస్థితి ఈ పది నెలల కాలంలో ఇంద్రకీలాద్రిపై కనిపిస్తోంది. గతంలో ప్రతి నెలా మొదటి, రెండో వారాల్లో వచ్చే ఆలయ సిబ్బంది వేతనాలు గత రెండు నెలలుగా ఆలస్యంగా వస్తుండగా, గత నెల అయితే ఏకంగా 17వ తేదీ తర్వాతే వారి ఖాతాలో జమయ్యాయి. మరి ఏప్రిల్ నెలలో వేతనాలు ఎప్పుడు వస్తాయోననే ఆందోళనలో దేవస్థాన ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు ఆలయంలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లు సైతం తమ బిల్లులు ఎప్పుడు అవుతాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఈవో రామచంద్రమోహన్ ప్రతి ఫైల్‌ను ఈ–ఫైల్‌లో అప్‌లోడ్ చేయాలని చెబుతున్నారు. అయితే ఈ–ఫైల్‌లో పెట్టిన బిల్లు ఎప్పుడు ఆడిట్‌కు వస్తుందో, అక్కడి నుంచి ఎప్పుడు చెక్‌కు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
అధికారుల తీరుపై ఆలయ డీఈవో ఆగ్రహం..
దుర్గగుడి ఆలయ అధికారులకు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(డీఈవో) రత్నరాజుకు మధ్య పోరు నడుస్తోంది. అధికారుల తీరుపై డీఈవో గుర్రుగా ఉన్నారు. ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, ఆర్జిత సేవల్లో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో జరుగుతున్న విశేష పుష్పార్చనలో ఈ వ్యవహారం బయట పడింది. ఆలయంలో కొంత మంది అధికారులు, సిబ్బంది తానంటే లెక్కలేనితనంగా చూస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సోమవారం ఉదయం అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించే పుష్పాలను ఆలయానికి తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో పూల గంపలను తీసుకుని అమ్మవారి సన్నిధికి వెళ్తున్నామని ఫెస్టివల్ సెక్షన్ అధికారి, ఏఈవో దుర్గారావు డీఈవో రత్నరాజుకు సమాచారం ఇచ్చారు. అయితే డీఈవో అక్కడికి వచ్చే సరికి కొంత మంది బోయి సిబ్బంది, ఆలయ సిబ్బంది పూల గంపలను తీసుకుని రాజగోపురం వరకు వచ్చేశారు. దీంతో తనను పిలిచి ఇలా అవమానించడం సరికాదంటూ రత్నరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత పూజా మండపంలోనూ కొంత మంది అర్చకులు డీఈవోను చూసీ చూడనట్లు వ్యవహరించారు. దీంతో మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసిన డీఈవో ఆలయ అధికారులు, సిబ్బంది తీరు సరిగా లేదని తగిన రీతిలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇంద్రకీలాద్రి దేవస్థానంలో రోజుకో పంచాయితీ కౌంటర్ల నిర్వహణపై వరుస ఫిర్యాదులు పాలన అంతా అస్తవ్యస్తం ఆలయ డీఈఓ వర్సెస్ అధికారులు అన్నట్లుగా పరిస్థితి
పర్యవేక్షణ లోపంతో వరుస ఫిర్యాదులు..
దుర్గగుడిలో ఏర్పాటు చేసిన క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్, సెల్‌ఫోన్ కౌంటర్లపై ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. గతంలో కాంట్రాక్టర్ నిర్వహించే చెప్పుల స్టాండ్‌ను గత ఫిబ్రవరి నెల మధ్య నుంచి దేవస్థానం పర్యవేక్షణలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. అయితే కౌంటర్‌లోని సిబ్బంది భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులందుతున్నాయి. టెండర్ నిర్వహించడం వల్ల దేవస్థానానికి సుమారు రూ. 30 లక్షల మేర ఆదాయం సమకూరేది. అయితే దేవస్థానం నిర్వహించడం వల్ల ఆదాయం కోల్పోవడమే కాకుండా వివాదాలకు తలకు ఎత్తుకున్నట్లు అయింది. దీంతో సెక్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపున భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరిచే కౌంటర్లపైన ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఆలయంలోకి భక్తులెవరూ సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదని దేవస్థానం నిర్ణయించింది. దీంతో టెండర్ ప్రక్రియ ద్వారా కౌంటర్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌కు అప్పగించింది. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే వారిలో పదిశాతం మంది ఎవరో ఒకరి సిఫార్సులపై ఆలయానికి వచ్చే వారే. వారిని కౌంటర్‌లో సెల్‌ఫోన్ భద్రపరుచుకోమని కాంట్రాక్టర్ సిబ్బంది చెప్పడం, అది వివాదాలకు దారి తీయడం పరిపాటిగా మారిపోయింది. సోమవారం క్యూలైన్లో తనిఖీలు చేస్తున్న నలుగురు కాంట్రాక్ట్ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ భక్తుడు ఆలయ ఈవో రామచంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో క్యూలైన్‌లో తనిఖీలు చేస్తున్న ప్రైవేటు సిబ్బందిని వెంటనే పోలీసులకు అప్పగించాలని ఆదేశించడమే కాకుండా వారిపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు.