
కనులపండువగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస వసంత నవరాత్రోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమ్మవారికి శ్వేత(తెలుపు), హరిత(పచ్చ) వర్ణ పుష్పాలతో విశేషంగా అర్చన జరిగింది. అమ్మవారికి తెల్ల జిల్లేడు, మల్లె పూలు, మారేడు బిల్వ పత్రాలు, తులసీ దళాలు, మందార పుష్పాలతో అర్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈఓ కె.రామచంద్రమోహన్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఇతర అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది అమ్మవారికి అర్చన నిర్వహించే పుష్పాలను ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పూజా మండపానికి చేరుకున్నారు. పూజా మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆయా పుష్పాలతో అర్చన నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయ దాతలు, భక్తులు పాల్గొన్నారు.

కనులపండువగా వసంత నవరాత్రోత్సవాలు