
కనువిందుగా విహంగామా
పెనుగంచిప్రోలు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎక్కడ చూసినా కొంగల కోలాహలం కనపడుతోంది. వందల సంఖ్యలో వచ్చిన పెయింటెడ్ స్టాక్స్ నేడు సంతానోత్పత్తి ద్వారా వేల సంఖ్యకు చేరాయి. వీటి అరుపులు, ఇవి చేసే ధ్వనులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. గ్రామ స్తులు ఏమాత్రం విసుక్కోకుండా, ఓపికగా వాటిని కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం గూళ్లల్లో పిల్లలను చేసి వాటిని సంరక్షించుకుంటున్నాయి.
వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి..
ఏటా వెంకటాపురం గ్రామానికి ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్ స్టాక్స్(ఎర్రకాళ్ల కొంగలు) డిసెంబర్‌లో వచ్చి విడిది చేస్తాయి. వందల సంఖ్యలో వచ్చే పక్షులు సంతానోత్పత్తి తరువాత జూన్‌లో వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి.
కలిసి వస్తున్న నీటి వనరులు...
పక్షులు ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులతో గతంలో అనేకం మృత్యువాత పడేవి. కుంటల్లో, చెరువుల్లో, పక్కనే ఉన్న మునేరులో కూడా నీరు లేక ఆహారం కూడా దొరకక అనేక ఇబ్బందులు పడేవి. అయితే గత రెండు మూడేళ్లుగా మునేరులో, నీటి కుంటలో, చెరువులలో కూడా నీరు పుష్కలంగా ఉండటంతో పక్షుల ఆవాసానికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఆహారానికి అవసరమైన చేపలు చెరువుల్లో, మునేరులో ఉండటంతో పక్షులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నాయి.
వెంకటాపురంలో
ఎర్రకాళ్ల కొంగల కోలాహలం

కనువిందుగా విహంగామా