
పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): హైకోర్టు న్యాయవాది అనుపమ దార్ల రచించిన ‘మీరు పనిచేసే చోట లైంగిక వేధింపులా.. పోష్ చట్ట ప్రయోజనాలు’ పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆవిష్కరించారు. లైంగిక వేధింపుల నివారణ చట్టం ఆధారంగా చేసుకుని రచించినట్లు రచయిత అనుపమ తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రచించిన పుస్తకంలో చట్టంలోని నిబంధనలు, వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు తదితర అంశాలను వివరించినట్లు పేర్కొన్నారు. శ్రామిక మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలు పొందడానికి ఈ చట్టం బలమైన కవచం అయినప్పటికీ, అమలు కేవలం కాగితాలకే పరిమితమని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్టు డైరెక్టర్ రావూరి సూయజ్, హ్యాపీ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్, మనస్తత్వవేత్త డి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
సందేశాత్మకంగా సాంఘిక నాటికలు
విజయవాడ కల్చరల్: పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్, ఏపీ చలన చిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణమండపంలో ఐదురోజులపాటు నిర్వహించే 44వ జాతీయ సాంఘిక నాటికల పోటీలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలి నాటికగా ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారు ప్రదర్శించిన మరీ అంతొద్దు నాటిక సందేశాత్మకంగా సాగింది. రచన ఆకురాతి భాస్కర్ చంద్ర, దర్శకత్వం నడింపిల్లి వెంకటేశ్వరరావు. రెండవ నాటికగా చెరుకురు సాంబశివరావు రచించి, దర్శకత్వం వహించిన విముక్తి నాటికను, మూడో నాటికగా ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమాలను కళాపోషకుడు డోగిపర్తి శంకరరావు ప్రారంభించారు. నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పీఎమ్‌కే ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. రంగస్థల సినీ నటుడు కొప్పుల ఆనంద్ నిర్వహించారు.

పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ