
ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట
హనుమాన్‌జంక్షన్ రూరల్:బాపులపాడు మండలం వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్‌కు చెందిన ‘ప్రాజెక్టు కామథేను’ పాల ఫ్యాక్టరీ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సమేత దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కనులపండువగా సాగింది. మహోత్సవం తిలకించేందుకు పాడి రైతులు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు దంపతుల చేతుల మీదగా ఆలయ శిఖర ప్రతిష్టను చిన్న జీయర్ స్వామి నిర్వహించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి దేవస్థానం నుంచి తెచ్చిన ముత్యాల తలంబ్రాలను భక్తులను అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రవచనాన్ని అందించారు. కృష్ణాజిల్లా ప్రాంతంలో గోవుల పెంపకం మరింత పెరగాలని, గో సంపద వృద్ధి చెందటం ద్వారా నేల సారాన్ని పెంచుకునే కృషి చేయాలి సూచించారు. పాల సహకార సొసైటీలకు యూనియన్ తరుపున బోనస్‌లను చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వర బాబు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, ఇతర పాలకవర్గ సభ్యులు, పాల సహాకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోండి
– డీఎస్‌డీవో అజీజ్
విజయవాడస్పోర్ట్స్:ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యాన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పర్యవేక్షణలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు ఆసక్తి ఉన్న క్రీడా సంఘాలు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌డీవో ఎస్.ఎ.అజీజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని క్రీడాంశాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. శాప్ ఆదేశాల మేరకు ఒక్కో క్రీడాంశంలో ఎనిమిది నుంచి 14 సంవత్సరాల లోపు వయసున్న 25 మంది బాలురు, 25 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇందిరాగాంధీ స్టేడియంలోని తమ కార్యాలయంలో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలని సూచించారు.
హోరాహోరీగా బార్ అసోసియేషన్ ఎన్నికలు
చిలకలపూడి(మచిలీపట్నం): బార్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. అధ్యక్షుడి స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. బూరగడ్డ అశోక్‌కుమార్, తుంగల హరిబాబు, డి.పోతురాజు పోటీలో ఉండగా 53 ఓట్ల ఆధిక్యంతో పోతురాజు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్ష స్థానానికి ముగ్గురు పోటీపడగా రెడ్రౌతు రమణరావు గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి స్థానానికి సిద్ధినేని సత్యసాయిబాబుపై శాయన సుధాకర్ గెలుపొందారు. కోశాధికారిగా పసుమర్తి సూర్యప్రకాశరావు ఉషా రాధాకృష్ణమూర్తిపై గెలుపొందారు. సహ కార్యదర్శిగా గాదె శామ్యూల్ అద్దెపల్లి నిరంజనరావుపై గెలుపొందారు. లైబ్రరీ కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ న్యాయవాది వింజమూరి శివరామ్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట

ఘనంగా దాసాంజనేయ స్వామి దేవస్థానం ప్రతిష్ట