కోనేరుసెంటర్: పోలీసు కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ గత ఏడాది మే 6వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన మురాల వెంకటేశ్వరరావు సతీమణి వీరమల్లు రాజేశ్వరికి పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తూ శుక్రవారం ఎస్పీ కారుణ్య నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వరరావు అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారు నేటి నుంచి విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణతో పాటు విధులను అత్యంత బాధ్యతగా నిర్వర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి. సత్యనారాయణ, ఏవో ఎంఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఒలింపిక్ సంఘం ప్రక్షాళనే పరిష్కారం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీవోఏ) ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), ఫెడరేషన్ గుర్తింపు ఉన్న రాష్ట్ర క్రీడా సంఘాలతో గురునానక్‌కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీవోఏ ప్రతినిధులుగా కొనసాగుతున్న వ్యక్తుల కారణంగా ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో ఆంధ్ర రాష్ట్ర క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఏపీవోఏని రెండుగా విడదీసిన వ్యక్తులతో చర్చించి, ఏపీవోఏని ఒక్కటిగా చేయాలని గతంలో ఆలోచించామన్నారు. ఏపీవోని ప్రక్షాళన చేయడమే ప్రభుత్వం ముందున్న మార్గమని బహిర్గతం చేశారు.
ఏపీవోఏ అడహాక్ కమిటీ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పి.టి.ఉషతో ఇటీవలే చర్చించామని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. అడహాక్ కమిటీ ఏర్పాటునకు క్రీడా సంఘాలన్ని కలిసి ఏకతాటిపైకి రావాలని ఆదేశించారు.
ఏపీ జూడో సంఘం సీఈవో వెంకట్ నామిశెట్టి, దక్షిణ భారత అథ్లెటిక్స్ మానటరింగ్ కమిటీ చైర్మన్ ఆకుల రాఘవేంద్రరావు, కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్, కాయకింగ్, తైక్వాండో, ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఖోఖో, హాకీ, మోడ్రన్‌పెంటత్లాన్, స్కైస్నోబోర్డ్, రైఫిల్‌షూటింగ్, బేస్‌బాల్ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం