కోడూరు:రపమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఏసు (52) తాడిచెట్ల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం కూడా ఏసు తాడిచెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు తెగడంతో కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఏసును స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడు భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ విక్రమ్ తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ వివాదంలో యువకుడికి తీవ్రగాయాలు
తిరువూరు: స్థానిక మునుకుళ్ళ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. గత నెల 30న జరిగిన సీఎస్‌కే ఆర్‌సీబీ ఐపీఎల్ మ్యాచ్‌పై కర్రి నవీన్‌కుమార్, కొయ్యల గంగా మహేష్ బెట్టింగ్ కాశారు. ఎవరు గెలిచినా రెండోవారు ఒక క్వార్టర్ బాటిల్ మద్యం కొని ఇవ్వాలని బెట్టింగ్ కాసినపుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయంలో ఆదివారం ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతోపాటు మద్యం మత్తులో ఉన్న మహేష్, ఖాళీ సీసాతో నవీన్‌పై దాడిచేశాడు. ఈఘటనలో నవీన్ తల, శరీరభాగాలపై తీవ్రగాయాలు కావడంతో అతన్ని తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓవ్యక్తి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఖాజావలి కథనం ప్రకారం.. కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ 8వ ఫ్లోర్‌లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.