పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారిని శనివారం పశుసంవర్ధక శాఖ జెడీ హనుమంతరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాయింట్ కమిషనర్ శివరామ్, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈసందర్భంగా వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అమ్మవారి గోశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో ఒడిశా యువకుడి మృతి
గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గుంటాకోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రానికి చెందిన తమిళ శ్రీను(18) గుంటాకోడూరు గ్రామంలో నరేష్ అనే వ్యక్తికి చెందిన చేపల చెరువు వద్ద నాలుగు నెలలుగా పని చేస్తున్నాడన్నారు. శుక్రవారం రాత్రి చేపల చెరువు వద్ద మరమ్మతు చేసిన మోటారును మారుస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు.
వెంటనే అతడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చెరువు వద్ద పని చేస్తున్న సూపర్‌వైజర్ మారుబోయిన వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎస్‌ఐ ఎన్.చంటిబాబు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం ఒడిశా నుంచి వచ్చిన మృతుడి తండ్రి, కుటుంబ సభ్యులకు శనివారం మృతదేహం అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
వన్యప్రాణుల రక్షణకు చర్యలు
జి.కొండూరు: వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేలుపుచర్లలో వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు అడవి పందులను అటవీ శాఖాధికారులు జి.కొండూరు మండల పరిధి మునగపాడు శివారులోని అటవీ ప్రాంతానికి శనివారం ఆటోలో తరలించారు. అనంతరం ఈ అడవి పందులను నూజివీడు అటవీశాఖ డీఆర్వో అరుణ ఆధ్వర్యంలో గ్రంథివాని చెరువు సమీపంలో దట్టమైన అడవిలో వదిలారు. బీట్ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతమ్మ సేవలో అధికారులు