
రంగస్థల, సినీ నటుడు బోలెం రామారావుకు నంది అవార్డు
చల్లపల్లి: ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కృష్ణాజిల్లా, చల్లపల్లికి చెందిన బోలెం రామారావు నేషనల్ బంగారు నంది అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జి.సి.ఎస్.వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉగాది, డాక్టర్ అంబేడ్కర్ జయంతి, మహనీయుల ప్రత్యేక అవార్డుల–2025 కింద ఈ జాతీయ బంగారు నంది అవార్డును రామారావు అందుకున్నారు. సాధారణ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్ అయినప్పటికీ మొదటి నుంచి రంగస్థల నాటకాలు, ఏకపాత్రాభినయాలు అంటే మక్కువ ఎక్కువ. కేవలం దివి ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నాటక పరదర్శనలు ఇచ్చిన రామారావు కళారంగ వాసులకు సుపరిచితుడే. సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుడిగా, వీరబాహుడుగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. బాలనాగమ్మ నాటకంలో మాయల ఫకీరుగా 500లకు పైగా ప్రదర్శనలు, ఏకపత్రాభినయాలు చేసి ప్రేక్షకులను రంజింపజేశారు.
విజయ మూవీతో పరిచయం..
రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతలు ఘడించిన రామారావుకు సినీ రంగంలో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్‌లో విజయ మూవీతో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం తరువాత విక్రమార్కుడు, బాహుబలి–1, బ్రహ్మిగాడి వీరగాథ, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో పలు పాత్రల్లో నటించారు. తెలంగాణ రాష్త్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ గుమ్మ డి వెన్నెల, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పతాని రామకృష్ణగౌడ్, సీనియర్ ఆర్ట్టిస్ట్ దొరైస్వామిల చేతుల మీదుగా బోలెం రామారావు ఆదివారం ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. బోలెం రామారావుకు పలువురు కళాకారులు, ప్రముఖులు, దివిప్రాంత ప్రజలు అభినందనలు తెలిపారు.