
ప్రమాదంలో పడిన రాజ్యాంగం
భవానీపురం(విజయవాడపశ్చిమ): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నేడు పెను ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని మార్చివేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు వస్తే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతి రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని అన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి లౌకికవాదాన్ని మట్టు పెట్టేందుకు ఇటీవల ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు నిదర్శనమని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజాస్వామ్యవాదులు ప్రతిజ్ఞ చేయాలని, అదే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అన్నారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసే దేశ ప్రజలు అయోధ్య ఎన్నికతో బీజేపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. డీ లిమిటేషన్ పేరుతో ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద రాజకీయాలు లౌకిక వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, నక్కా వీరభధ్రరావు, బుట్టి రాయప్ప, పంచదార్ల దుర్గాంబ, ఎం. సాంబశివరావు, కేవీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ