
గురుకులంలో కొత్త చరిత్ర
నిమ్మకూరు(పామర్రు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సత్తా చాటారు. గత విద్యా సంవత్సరాల్లో చదువుల కోసం శ్రద్ధతో తీసుకున్న ప్రత్యేక చర్యలు వారికి ఉపకరించాయి.
ఉత్తమ ఫలితాలు..
పామర్రు మండల పరిధి నిమ్మకూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం మంచి వసతులతో కూడిన విద్యను అందించింది. విద్యార్థులకు కళాశాలలో అన్ని సబ్జెక్టులలో మెరుగైన విద్యాబోధన, ల్యాబ్‌లలో అన్ని రకాల పరీక్షలకు చక్కని తర్ఫీదునిచ్చింది. అవసరమైన వారికి ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వహించింది. అంతే కాకుండా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు మంచి ఆహారం, వసతి తదితరాలను కల్పించింది. వాటి ఫలితంగా విద్యార్థులు పరీక్షల్లో సత్తా చాటారు. గురుకుల కళాశాలలో 2024–25 ఏడాదిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో వెలమల మణికంఠ ఎంపీసీ గ్రూపులో 987/1000, బైపీసీలో దూది రేష్మ 990/1000, సీఈసీలో ఆర్. వనదుర్గ 949/1000 సాధించి ఏపీ గురుకులాల స్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఈసీలో జీవీవీఎస్ చైతన్య 971/1000, సీజీటీలో ఎల్. కుసుమ రాణి 971/1000 సాధించింది. వీరందరూ ఒకే కళాశాలకు చెందిన వారు కావడం.. అందరూ 900లకు పైగా మార్కులు సాధించడం విశేషమని గురుకులం ప్రిన్సిపల్ గ్రేస్ సుభాషిణి పేర్కొన్నారు.

గురుకులంలో కొత్త చరిత్ర