
రోటావేటర్‌లో పడి కౌలు రైతు మృతి
కోడూరు: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ కౌలు రైతు రోటావేటర్‌లో పడి మృతిచెందిన ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పి.కె.వి.సత్యనారాయణ కథనం మేరకు.. కోడూరు శివారు నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లా నాగమల్లేశ్వరరావు (60) అదే గ్రామంలో 80 సెంట్ల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం పంటభూమి ఖాళీగా ఉండడంతో కూరగాయాల సాగుకు ఏర్పాట్లు చేశాడు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమ యంలో ఈ భూమిలో రోటావేటర్‌తో మట్టి పని చేపట్టాడు. రోటావేటర్ బ్లేడ్లకు మట్టి పట్టడంతో నాగమల్లేశ్వరావు తొలగించే ప్రయత్నం చేశాడు. నాగమల్లేశ్వరరావును గమనించకుండా డ్రైవర్ ప్రభు కుమార్ రోటావేటర్ బ్లేడ్లను తిప్పాడు. దీంతో నాగమల్లేశ్వరరావు రెండు కాళ్లు రోటా వేటర్ బ్లేడ్లలోకి వెళ్లి విరిగిపోయాయి. ఓ బ్లేడు నాగమల్లేశ్వరరావు డొక్కలో బలంగా దిగింది. స్థానికులు హుటాహుటిన నాగమల్లేశ్వరరావును అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ ప్రభుకుమార్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు.