
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మే రెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్ పలు శాఖల జిల్లా అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి విచ్చేస్తున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని తెలిపారు. వీవీఐపీలు పర్యటించే ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా సమాచారం అందించాలని సూచించారు. ప్రధాని భద్రతపై ఎస్పీజీతో చర్చించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖులు రాకపోకల సమయంలో ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ మీదుగా అమరావతి వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు వహించాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఆర్‌అండ్‌బీ అధికారి లోకేష్, ఆర్టీఓ శ్రీనివాసు, డీఎస్‌ఓ పార్వతి, డీఎఫ్‌ఓ సునీత, ఎయిర్‌పోర్ట్ సహాయ మేనేజర్ శ్రీలేఖ, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.