
పెద ఓగిరాలలో భారీ చోరీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని పెద ఓగిరాలలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నిద్రిస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లుగా కంకిపాడు సీఐ మురళీకష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన మా రెడ్డి మాధవి ఒంటిరిగా ఉంటుంది. భర్త వ్యాపారం రీత్యా గుంటూరులో ఉంటారు. కుమారుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. మాధవి ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో దుండగులు వెనుక తలుపుకున్న తాళం వద్ద గొళ్లాన్ని విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదుతో పాటు కొంత బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో పరిశీలించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ బాబు తెలిపారు.
బైక్ చోరీ....
భారీ చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇంటి బయట నిలిపి ఉంచిన ఓ బైకును సైతం దొంగలు అపహరించారు. ప్రతిరోజు ఇంటి లోపల భద్రపరచుకునే వాహన యజమాని శుక్రవారం రాత్రి బయటనే పార్కింగ్ చేసి ఉంచడంతో దుండగులు ఆ బైకును సైతం దొంగిలించారు.