
దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
విజయవాడ కల్చరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. తిరుమలలో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటు న్నాయని, ఇది రాష్ట్రానికే అరిష్టమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో మంగళ వారం లబ్బీపేట వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ‘హిందూ ధర్మం.. గోమాత విశిష్టత’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనాథ సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సాధువులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సాధు సంతులపై చేస్తున్న దాడులను ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, తిరుమలలో నిత్యం వివాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో హిందు వులు పవిత్రంగా భావించే గోవులు మరణిస్తుంటే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. సాధు శ్రీశివానంద సరస్వతి మాట్లాడుతూ.. తిరుమలలో అవనీతి రాజ్యమేలుతోందని, ఆగమ శాస్త్రా లకు విరుద్ధంగా కైంక ర్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి నెలా గోవులు మరణిస్తుంటే కాకతాళీయం అంటూ కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. మన గుడి – మన గోవు, మన ధర్మం నినాదం ఇంటింటా మారుమోగాలని సూచించారు. అవధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో గోవులను పెంచాలని, వాటి నిర్వహణను గోసంరక్షకులే చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దయానంద సరస్వతి, పూర్ణానంద స్వామి, శివస్వామి, లక్ష్మీశివనందస్వామి, స్వామి సత్యజ్ఞానానంద, ఆత్మానంద స్వామి, సత్యనారాయణ స్వామి, ఓంకార స్వామి పాల్గొన్నారు.
తిరుమలలో నిత్యం వివాదాలు సాధు సంతులపై తక్షణం దాడులను అరికట్టాలి రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు